How To Fall Asleep After Waking Up In The Middle Of The Night : ఏవో ఆలోచనల ఒత్తిడి, టెన్షన్లు, పీడ కలలు, నిద్రలేమి సమస్యలు లేదా టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం ఇలా కారణాలు ఏవేనా మీకు రాత్రిపూట నిద్ర మధ్యలో మెలకువ రావడం సహజమే. ఇది పెద్ద సమస్యేమీ కాదు. కానీ మళ్లీ ఎంత ప్రయత్నించినా తిరిగి నిద్ర పట్టకపోవడం మాత్రం కచ్చితంగా సమస్యే.
రాత్రిపూట మేలుకున్నాక తిరిగి మీరు నిద్రపోకపోతే, మీ ఎనిమిది గంటల నిద్ర పూర్తవకపోతే, మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రమాదమేనని అంటున్నారు నిపుణులు. రాత్రంతా మీరు నిద్రపోకపోతే పగలు నిద్రపోవాల్సి వస్తుంది. లేదా మీ నిద్ర అలవాట్లు మారడం వల్ల నిద్రలేమి సమస్య దీర్థకాలికం అవచ్చు. ఫలితంగా మీ పనితీరు దెబ్బతింటుంది. అలాగే మీలో మూడ్ స్వింగ్స్, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
మరెలా? ఏం చేయాలి? కళ్లు మూసుకున్నా, కదలకుండా పడుకున్నా అటు ఇటు దొర్లి ఎంత ప్రయత్నించినా ఒక్కసారి మెలకువ వచ్చాక తిరిగి అస్సలు నిద్ర రావట్లేదే అంటారా? రాత్రి పూట అసలు మీకు మెలకువ రాకుండా ఉండేందుకు ఒకవేళ వచ్చినా తిరిగి త్వరగా నిద్ర పట్టేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు మా దగ్గరున్నాయి. అవేంటో తెలుసుకుని ఓ సారి ప్రయత్నించి చూడండి!
1.స్క్రీన్ టైం
రాత్రి పూట మెలకువ వచ్చాక తిరిగి నిద్రపోవాలంటే మొదట మీరు చేయాల్సిన పనేంటంటే మీ ఫోన్ పట్టుకోకుండా ఉండటం. నిజానికి రాత్రి పడుకునే ముందు కానీ, మధ్యలో మెలకువ వచ్చినప్పుడు కానీ, ఉదయాన్నే లేచిన వెంటనే కానీ ఫోన్, టీవీ లేదా ల్యాప్‌ట్యాప్‌లను అస్సలు చూడకూడదు. ఎందుకంటే వీటి నుంచి విడదలయ్యే కాంతి మీరు నిద్ర పోవడానికి కావలసిన మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది.
2. నీరు తాగడం
హైడ్రేటెడ్‌గా ఉండటం ఆరోగ్యానికి చాల ముఖ్యం. అలాగని రాత్రి పడుకునే ముందు నీరు తాగడం మీ నిద్రకు మంచిది కాదు. ఎందుకంటే పడుకునే ముందు నీరు లేదా ఇతర పానీయాలు, పండ్ల రసాలు, తాగడం వల్ల మీరు అర్థరాత్రి పూట టాయిలెట్ కోసం లేవాల్సి వస్తుంది. లేచాక మళ్లీ నిద్ర పట్టడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అర్థరాత్రి మెలకువ రాకుండా ఉండాలంటే మీరు పడుకోవడానికి అరగంట ముందు నుంచి ఏమీ తాగకూడదు.
3. శ్వాసపై ధ్యాస
అర్థరాత్రి మెలకువ వచ్చాక తిరిగి నిద్రపట్టాలంటే మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. శ్వాసపై మాత్రమే ధ్యాస పెట్టాలి. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు త్వరగా నిద్రపడుతుంది.
4. లైట్స్ వేయకూడదు
రాత్రి మెలకువ వచ్చిందని నిద్ర పట్టడం లేదని లైట్ వేయడం, బయట వెలుతురులో తిరగడం లాంటివి చేయకండి. లైట్ వెలుతురు, లేదా చంద్రుడి వెలుతురు వల్ల మీకు నిద్ర మరింత దూరమవుతుంది. మీ మైండ్ ఇంకా యాక్టివ్ అయి తిరిగి నిద్ర పట్టడం చాలా కష్టమవుతుంది. కాబట్టి చీకట్లో, ప్రశాంతంగా పడుకుంటే త్వరగా నిద్రపోవచ్చు.
5. టైం చూడటం మానేయండి
మెలకువ రాగానే మొదటగా చేసే పని టైం చూడటం. చాలా మంది నిద్ర పట్టడం కష్టమే అనుకుంటూ మళ్లీ మళ్లీ గడియారం లేదా ఫోనులో టైం చూస్తూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల మీకు నిద్ర పట్టనే పట్టదు. పైగా అయ్యో ఇంతసేపైనా నిద్ర పట్టడం లేదే, నిద్ర సరిపోదే అనే ఆందోళన, ఒత్తిడి మీలో పెరిగే అవకాశం ఉంది.
6. కాఫీ, టీలు తాగొద్దు!
రాత్రి నుంచి ఉదయం వరకు మీరు ప్రశాంతంగా నిద్ర పోవాలంటే పడుకునే ముందు కాఫీ, టీలు తాగే అలవాటు మానుకోవాలి. వీటిలో ఉండే కెఫైన్ మీ మెదడును ఆక్టివ్ చేసి మధ్య రాత్రి మెలకువ వచ్చేలా చేస్తుంది.
7. ఆలోచనలు లేకుండా!
ప్రశాంతంగా నిద్ర పోవాలంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఉదయం నుంచి జరిగిన వాటి గురించి ఆలోచించచ్చు. కానీ వాటి గురించి, తర్వాత రోజు గురించి ఆందోళన పడకూడదు. ఏదైతే అది అయిందిలే అనుకుంటూ హాయిగా నిద్రపోతే మీకు అర్థరాత్రి పీడకలు, అకస్మాత్తుగా మెలకువ రాకుండా ఉంటాయి.
8. సౌకర్యవంతమైన చోటు
చక్కగా పడుకోవాలంటే శుభ్రమైన, సౌకర్యవంతమైన చోటు తప్పనిసరి. మధ్య రాత్రి మెలకువ రాకుండా హాయిగా నిద్రపోవాలంటే మీ పడక గది చీకటిగా, దోమలు లేకుండా ప్రశాంతంగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి.
పురుషుల కంటే మహిళలకే ఎక్కువ నిద్ర అవసరమట! ఎందుకో మీకు తెలుసా?