Effect Of Using Dirty Sponge In Kitchen : కిచెన్‌ను క్లీన్ చేసేందుకు చాలా మంది వినియోగించే వాటిలో స్పాంజ్ ప్రధానమైంది. గిన్నెలు తోమడానికి, వంటగదిలో నేలపై పడ్డ మరకలను తుడవడానికో కచ్చితంగా దీన్ని వాడుతుంటారు. అయితే సరిగ్గా వాడకపోతే ఇది మొత్తం కిచెన్ అంతా బ్యాక్టీరియాను వ్యాపింపజేస్తుందనీ, ఇది మీ ప్రేగులకు పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుందని మీలో ఎంత మందికి తెలుసు. ఒక్క మురికి స్పాంజ్ కొన్ని వేల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలకు బీజం వేస్తుంది. ఫలితంగా మన ఆహారం కలుషితమై రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది.
సాధారణంగా చాలా వరకూ స్పాంజ్‌లను ఏదైనా లిక్విడ్స్‌ను పీల్చుకోవడానికి వినియోగిస్తాం. ఈ స్పాంజ్‌లు అన్నీ కూడా సెల్యూలోజ్, ఉరేతన్, ఫోమ్‌తో తయారుకావడం వల్ల లిక్విడ్స్‌ను వేగవంతంగా శోషించుకుంటాయి. కొన్నిసార్లు స్క్రబ్బింగ్ చేసేందుకు వీలుగా ఉండాలని సింథటిక్ స్పాంజ్‌లను కూడా వాడుతుంటారు. వీటిలో ఏదైనా సరే అవసరానికి వాడేసి, తరువాత వాటన్నిటిని ఒక మూలన పెట్టేస్తుంటారు. అక్కడే వస్తుంది అసలు సమస్య. పరిసరాలను క్లీన్ చేసిన స్పాంజ్‌లను గోడలకు ఓ మూలన ఉంచేస్తే, అక్కడ బ్యాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉంటుంది. ఆ స్పాంజ్‌లలో ఉన్న మిగిలిపోయిన ఆహారపదార్థాలు బ్యాక్టీరియాను క్రియేట్ చేస్తాయి. అలా బ్యాక్టీరియాతో పేరుకుపోయిన స్పాంజ్‌లతో తిరిగి పరిసరాలను శుభ్రం చేసినప్పుడు అదంతా వంట గది ఉపరితలాలకు అంటుకుపోతుంది. అక్కడ ఏవైనా ఆహార పదార్థాలు ఉంచినప్పుడు వాటికి వ్యాప్తించి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ పెరిగేందుకు కారణమవుతాయి.
కలుషితమైన ఆహారంలో లేదా నీళ్లలో ఉండే సాల్మోనెల్లా, మాంసంలో ఉండే కాంపీలోబ్యాక్టర్, కలుషితమైన ఆహారంలో ఉండే ఎంటరోబ్యాక్టర్ క్లోకే, దుమ్ము, ధూళి ద్వారా కలిగే ఎసినేటోబ్యాక్టర్, మొండి మరకల ద్వారా వ్యాపించే ఎచ్చేరిచియా కొలి ఇన్ఫెక్షన్లు వంటగదిలోనే ఉంటాయి. ఇవి స్పాంజ్‌ల ద్వారా వ్యాపించి శరీరాన్ని ఇబ్బందికి గురి చేస్తాయి. శుభ్రం లేని స్పాంజ్‌లను పదేపదే వాడుతుండటం వల్ల ఇది సంభవిస్తుంది. బ్యాక్టీరియా అందులోనే ఉండి పొడిగా కనిపించినప్పటికీ సులువుగా వ్యాప్తి చెందుతుంది. అందుకే సాధారణంగా క్లీనింగ్ కోసం వినియోగించే స్పాంజ్‌లలో ఎప్పటికప్పుడూ తాజాగా ఉండే వాటిని ఉపయోగిస్తుండాలి. కనీసం 1-2 వారాలకు ఒకసారైనా స్పాంజ్‌లు మారుస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మాంసం, జ్యూస్‌లు లాంటి వాటిని క్లీన్ చేసేందుకు డిస్పోజబుల్ వైప్స్ లేదా పేపర్ టవల్స్ వాడటమే ఉత్తమం. ఆ పదార్థాలను క్లీన్ చేసిన తర్వాత, చేతులను శుభ్రంగా కడిగిన తర్వాతే వేరే వస్తువులను ముట్టుకోవాలి. లేదంటే స్పాంజ్‌లతోనే కాకుండా మన చేతుల ద్వారా కూడా బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదముంది.