Home Remedies to Prevent Sciatica : మన శరీరంలో వెన్నపాము నుంచి పాదాల వరకు ఉండే అత్యంత పొడవైన నరం.. సయాటికా. ఇది పాదాల పనితీరు, స్పర్శ వంటి వాటిని నియంత్రిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నరం మీద కలిగే ఒత్తిడిని "సయాటికా నొప్పి" అంటారు. దీని ఫలితంగా కాళ్లలో తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవడం, మంట, నడకలో మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో సయాటికా నొప్పి సర్జరీ వరకు వెళ్తుంది. కానీ, అలాకాకుండా సయాటికా నొప్పిని(Sciatica Pain) మొదట్లోనే గుర్తించి కొన్ని సహజ నివారణ మార్గాలు పాటిస్తే ఈజీగా ఆ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సయాటికా నొప్పి రావడానికి అనేక కారణాలు ఉండొచ్చంటున్నారు నిపుణులు. అయితే, నొప్పి తీవ్రత మరీ ఎక్కువగా లేనప్పుడు ఈ ఆయుర్వేద టిప్స్, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సయాటికాను ఎలాంటి సర్జరీ లేకుండా తగ్గించుకోవచ్చంటున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీదేవి. అవేంటంటే..
కోల్డ్ కంప్రెషన్ : కొన్నిసార్లు సయాటికా నొప్పిని తగ్గించడంలో కోల్డ్ కంప్రెషన్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు డాక్టర్ గాయత్రీదేవి. ఇందుకోసం చల్లని ప్యాడ్ లేదా ఐస్ ప్యాక్స్(Harvard Medical School రిపోర్టు) తీసుకొని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచండి. అయితే, వీటిని నేరుగా చర్మంపై పెట్టకుండా క్లాత్ లేదా టవల్లో ఉంచి యూజ్ చేయండి. అలాగే.. వాటిని ఒకేసారి 15 నుండి 20 నిమిషాలకు మించకుండా ఉంచేలా చూసుకోవాలి. అంతేకాదు.. మధ్యలో కనీసం 15 నుంచి 20 నిమిషాల విరామం ఇస్తూ ఉండాలి. ఇలా.. ఆన్-ఆఫ్-ఆన్-ఆఫ్ సైకిల్ని ఫాలో అవుతూ కోల్డ్ కంప్రెషన్ థెరపీని రోజుకు 3 నుంచి 5 సార్లు ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా సయాటికా నరాలపై ఏర్పడిన ఒత్తిడి తొలగి.. నొప్పి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుందంటున్నారు.
వార్మ్ కంప్రెషన్ : ఇదీ సయాటికా నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుందంటున్నారు డాక్టర్ గాయత్రీదేవి. ఇందుకోసం.. టవల్లో చుట్టబడిన వేడినీటి సీసా లేదా హీటింగ్ ప్యాడ్‌ను యూజ్ చేయవచ్చు. అయితే.. కనీసం 15 నిమిషాలు వేడిని వర్తించేలా చూసుకోవాలి. కానీ.. మరీ ఎక్కువగా యూజ్ చేయొద్దు. ఎందుకంటే.. సరిగ్గా ఫాలో కాకపోతే వార్మ్ కంప్రెషన్ థెరపీ కాలిన గాయాలకు కారణం కావొచ్చంటున్నారు. ఒకవేళ మీరు హీటింగ్ ప్యాడ్‌ని ఉపయోగిస్తుంటే.. దానిని అప్లై చేసేటప్పుడు నిద్రపోకుండా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.
కదలడం చేస్తుండాలి : నిజానికి సయాటికా నొప్పి ప్రారంభమైన తర్వాత మొదటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవడం మంచిది. కానీ, ఆ తర్వాత కూడా ఎటు కదలకుండా విశ్రాంతి తీసుకుంటే సమస్యను మరింత తీవ్రం చేస్తుందట. కాబట్టి.. సయాటికా నొప్పి తగ్గాలంటే కదలడం చేస్తుండాలంటున్నారు డాక్టర్ గాయత్రీదేవి. ఇది కండరాలను బలపర్చడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అయితే.. అటుఇటు లేచి తిరగడం, కదలడం.. వంటివి నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుందనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదంటున్నారు.
అదేవిధంగా.. అధిక బరువులు ఎత్తడం వంటి శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. దీనితో పాటు ఎక్కువగా వంగకుండా సరైన రీతిలో పడుకోవడం, కూర్చోవడం చేయాలి. సరైన పౌష్టికాహారం తీసుకుంటూ తేలికపాటి వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం ద్వారా సయాటికా నుంచి మంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
అద్భుతం: ఈ పౌడర్ రోజూ ఒక్క చెంచా తీసుకుంటే - వెన్నునొప్పి మొదలు ఈ సమస్యలన్నీ పటాపంచల్!
వయసు మీద పడటం, ఎక్కువ సేపు కూర్చోవడం మాత్రమే కాదు - "నడుము నొప్పి"కి ఇవీ కారణాలే!