Warning Signs Of High Blood Pressure : అధిక మూత్ర విసర్జన అనేది అంత ఈజీగా తీసిపారేసే విషయం కాదని గుర్తుంచుకోండి. ఎందుకంటే.. ఇది ఏదైనా ఆరోగ్య సమస్య లక్షణం కావొచ్చు. ముఖ్యంగా కొందరికి రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన అవుతుంది. అయితే, చాలా మంది దీనిని డయాబెటిస్ లక్షణంగా భావిస్తుంటారు. కానీ, అది షుగర్ లక్షణం మాత్రమే కాదని.. మరో ప్రమాదకర ఆరోగ్య సమస్య హెచ్చరికా సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మెజార్టీ పీపుల్ రాత్రిపూట అధికంగా మూత్ర విసర్జన చేయడాన్ని.. మధుమేహం సంకేతంగా భావిస్తుంటారు. కానీ, అది డయాబెటిస్ మాత్రమే కాదని.. 'అధిక రక్తపోటు'(High Blood Pressure) వల్ల కూడా నైట్ టైమ్ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. రక్తపోటు స్థాయిలలో అసమతుల్యత ఉన్నప్పుడు కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. ఆ కారణంగా మూత్రపిండాలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు.
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? - ఈ ఆహారాలు ఔషధం!
కాబట్టి.. మీలో ఇలాంటి లక్షణం కనిపిస్తే డయాబెటిస్ పరీక్షతో పాటు బీపీ పరీక్ష కూడా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా ఒకవేళ మీకు హైబీపీ ఉంటే త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. లేదంటే.. హై-బీపీ కారణంగా ధమనులు దెబ్బతింటాయి. ఫలితంగా గుండెపోటు లేదా స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. అంతేకాదు.. అధిక రక్తపోటు సమస్యను అదుపు చేయకుండా వదిలేస్తే, గుండె సమస్యలే కాకుండా మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుందని.. దృష్టి కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం కూడా జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే.. అధిక రక్తపోటు సమస్యను త్వరగా గుర్తించి అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.
2016లో "హైపర్‌టెన్షన్"అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేసే అవకాశం ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ ఎస్. రోజెన్ పాల్గొన్నారు. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన అధిక రక్తపోటు ఉన్నవారి ఒక సాధారణ లక్షణం కూడా కావొచ్చని ఆయన పేర్కొన్నారు.
అధిక రక్తపోటు సమస్య ఉంటే.. రాత్రిపూట అధిక మూత్రవిసర్జన మాత్రమే కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయంటున్నారు నిపుణులు. అవేంటంటే.. ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా నిత్యం అలసిపోతున్నా అలర్ట్ కావాలంటున్నారు. ఎందుకంటే ఇది హైబీపీకి సంబంధించిన ప్రారంభ లక్షణంగా చెప్పుకోవచ్చంటున్నారు. అలాగే బీపీ ఎక్కువగా ఉంటే.. పాదాలు, కాళ్లలో వాపు కనిపిస్తుందంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ ఫుడ్స్ తింటున్నారా? - అయితే మీకు బీపీ గ్యారెంటీ! - Worst Foods For Blood Pressure