Healthy Shampoos For Dry Hair : అందరూ చర్మ సౌందర్యం తర్వాత ఎక్కువగా శ్రద్ధ చూపించేది హెయిర్ మీదనే. జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల షాంపూలను ఉపయోగిస్తుంటారు. అయితే, మార్కెట్లో దొరికే మెజారిటీ షాంపూలలో హానికరమైన కెమికల్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవి మన జుట్టును పల్చగా, పొడిగా మార్చుతాయని తెలియజేస్తున్నారు. మన హెయిర్‌ను డ్యామేజ్ చేసే ఆ హానికర కెమికల్స్ ఏవి? వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్‌ను డ్రైగా చేస్తాయి..
షాంపూలలో ఉండే సల్ఫేట్, పారాబెన్ వంటి కెమికల్స్ జుట్టును పల్చగా, పొడిగా, నిర్జీవంగా చేస్తాయని నిపుణులంటున్నారు. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నవారు చికాకు, జుట్టు ఎండిపోవడం, చర్మం ఎర్రగా మారడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఈ కెమికల్స్ కంటిలోకి వెళ్తే కళ్లు ఎర్రగా మారతాయట.
సల్ఫేట్ ఫ్రీ షాంపూలే మార్గం..
పై పరిస్థితి రాకుండా ఉండాలంటే.. సల్ఫేట్ లేని షాంపులు వినియోగించాలని సూచిస్తున్నారు. సల్ఫేట్ ఉండే షాంపూలను వాడితే.. సహజ సిద్ధంగా జుట్టు, స్కాల్ప్‌లో ఉండే నూనె గుణాలు తొలగిపోతాయట. దీనివల్ల కుదుళ్లు బలహీనంగా మారతాయని చెబుతున్నారు. జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు.. సల్ఫేట్ ఫ్రీ షాంపూలు ఉపయోగించాలని సూచిస్తున్నారు. అయితే.. సాధారణ షాంపూలకన్నా సల్ఫేట్ లేని షాంపులు ధర ఎక్కువగా ఉంటాయి. కానీ, జుట్టును రక్షించడంలో ఎంతగానో సహాయపడతాయి.
సల్ఫేట్ వల్ల లాభం ఏంటి ?
మనం సాధారణంగా ఉపయోగించే షాంపూలు జుట్టుకు ఉండే జిడ్డు, మురికిని నురగ రూపంలో తొలగిస్తాయి. ఈ నురగ రావడానికి ప్రధాన కారణం షాంపూలో ఉండే సల్ఫేట్ కెమికల్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొంత మంది సల్ఫేట్ ఫ్రీ షాంపూలను వాడినప్పుడు అవి అంతగా నురగనివ్వవు. దీనివల్ల వారు ఆ షాంపూలు హెయిర్‌ను క్లీన్ చేస్తున్నాయో లేదోనని అనుకుంటారు. కానీ, అవి చాలా ప్రభావవంతంగానే పని చేస్తాయి.
హెయిర్‌కు కలర్ వేస్తే ఏ షాంపూ వాడటం మంచిది ?
ఈ రోజుల్లో చాలా మంది వెంట్రుకలకు రంగు వేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వారు సల్ఫేట్ ఫ్రీ షాంపూలను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సల్ఫేట్ ఉండే షాంపూలు హెయిర్ కలర్‌ను తొందరగా తొలగిస్తాయని తెలియజేస్తున్నారు.
ఏ షాంపూ ఉపయోగించడం మంచిది ?
మీ జుట్టు పొడిగా ఉండి, చిట్లినట్లుగా, నిర్జీవంగా ఉంటే సల్ఫేట్, పారాబెన్ వంటి కెమికల్స్ లేని షాంపూలను ఉపయోగించండి. ఇవి జుట్టు ఆరోగ్యవంతంగా మెరుస్తూ ఉండటంలో సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నూనె రాస్తే జుట్టు రాలదా? వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి?
జుట్టు రాలిపోతోందా? కారణాలు అవే కావొచ్చు.. ఇలా చేస్తే సెట్!
Hair Growth Tips : జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరగాలా? ఈ పనులు అస్సలు చేయకండి