Health Risks Of Eating Ice Cream At Night : ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఎంతో ఇష్టంగా ఒకటికి రెండు కప్పుల ఐస్‌క్రీమ్ తింటుంటారు. ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్, పుట్టినరోజు వేడుకలు జరిగితే తప్పకుండా ఐస్‌క్రీమ్ ఉండాల్సిందే. అయితే, కొంత మందికి రాత్రిపూట ఐస్‌క్రీమ్ తినడం అలవాటు ఉంటుంది. వీరు భోజనం చేసిన తర్వాత ఐస్‌క్రీమ్ తింటారు. ఇలా నైట్ పడుకునే ముందు ఐస్‌క్రీమ్ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఐస్‌క్రీమ్ తినడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.
రాత్రిపూట ఐస్‌క్రీమ్ తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు :
నిద్ర నాణ్యత తగ్గుతుంది :
ఐస్‌క్రీమ్‌లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. దీనిని రాత్రిపూట ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
బరువు పెరుగుతారు :
ఐస్‌క్రీమ్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. మీరు రాత్రి పూట భోజనం చేసిన తర్వాత ఐస్‌క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2020లో "అపెటైట్" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రాత్రిపూట ఐస్‌క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందని, బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన 'డాక్టర్ డేవిడ్ జె. స్పీగెల్' పాల్గొన్నారు. నైట్ ఐస్‌క్రీమ్ తినడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందని, అలాగే బరువు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
జీర్ణ సమస్యలు :
ఐస్‌క్రీమ్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట ఐస్‌క్రీమ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంత మందిలో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులంటున్నారు.
దంత సమస్యలు :
ఐస్‌క్రీమ్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. నైట్ ఐస్‌క్రీమ్ తినడం వల్ల దంత క్షయానికి దారితీస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
మధుమేహం :
ఇన్సులిన్ హార్మోన్ మనిషి శరీరంలో లేదా రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతులు ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువగా.. తీసుకోనప్పుడు తక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఇది క్రమబద్ధంగా ఉత్పత్తి కానిపక్షంలో రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి మధుమేహానికి దారి తీస్తుంది. ఐస్‌క్రీమ్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. నైట్ ఐస్‌క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.