Diabetes Health Problems : ప్రస్తుత ఆధునిక యుగంలో ఎంతో మందిని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. ఒక్కసారి బాడీలో షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే.. జితాంతం మందులు వాడాల్సి వస్తుంది. మధుమేహం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపు తప్పుతాయి. మనం తినే ఆహారం నుంచి వచ్చే చక్కెరను.. శరీరం శక్తిగా మార్చడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. అయితే.. కొందరిలో ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. మరికొందరిలో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. దీంతో.. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. ఈ పరిస్థితినే షుగర్ వ్యాధి అంటారు. ఇందులో ప్రధానమైనవి రెండు. ఒకటి టైప్1 డయాబెటిస్.. రెండోది టైప్ 2 డయాబెటిస్.
(NIDDK) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ నివేదిక ప్రకారం.. చక్కెర వ్యాధిలో చాలా రకాలుంటాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన 'డాక్టర్ డేనియల్ బెస్సేన్' (Daniel Bessesen) పాల్గొన్నారు. మధుమేహం వల్ల కళ్లు, మూత్రపిండాలు, నరాలు, గుండె ఆరోగ్యం దెబ్బతింటాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.
Types of Diabetes
టైప్ 1 డయాబెటిస్ :
టైప్ 1 డయాబెటిస్ ఉంటే శరీరంలో ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది లేదా కాకపోవచ్చు. ఇన్సులిన్ హార్మోన్ తయారయ్యే పాంక్రియాస్లో కణాలు నాశనమవుతాయి. సాధారణంగా టైప్ 1 డయాబెటిస్ పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారికి వస్తుంది. కానీ, కొందరిలో ఏ వయసులోనైనా ఇది కనిపిస్తుంది. టైప్ 1 మధుమేహం ఉన్నవారు ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
టైప్ 2 డయాబెటిస్ :
టైప్ 2 డయాబెటిస్ ఉంటే శరీరంలోని కణాలు ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేవు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేస్తూ ఉండవచ్చు. కానీ రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉండడానికి తగినంతగా ఇన్సులిన్ స్థాయులు ఉండవు. ఈ రకం మధుమేహం అధిక బరువు, ఊబకాయం, వంశపారంపర్యంగా వస్తుంది. చాలా మందిలో కనిపించే షుగర్ వ్యాధి రకం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. ఇంకా.. జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ డయాబెటిస్, మోనోజెనిక్ మధుమేహం వంటివి చాలా రకాలున్నాయి.
నిర్లక్ష్యం చేస్తే అంతే..
షుగర్ వ్యాధి వల్ల ఎన్నో ప్రమాదకర రోగాలు చుట్టుముడతాయి. గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాలు దెబ్బతింటాయి. అంతేకాదు.. కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది. నరాలు దెబ్బతిని అస్తవ్యస్తం అవుతాయి. అందుకే.. షుగర్ విషయంలో అలర్ట్ గా ఉండాలని, తప్పకుండా చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
షుగర్ నియంత్రణ ఇలా..
షుగర్ ఉన్నవారు నియంత్రించుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తక్కువ కేలరీలు, తక్కువ చక్కెర, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వైద్యుడు సూచించిన మందులను తప్పక తీసుకోవాలి. అధిక బరువు ఉంటే.. తగ్గించుకోవాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
ఉదయం నిద్రలేచాక ఇలా అనిపిస్తోందా? - అయితే, మీకు డయాబెటీస్ ముప్పు ఉన్నట్టే!