Best Tips To Improve Brain Health : ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో.. దీర్ఘకాలిక ఒత్తిళ్లు, నిరంతరమైన ఆందోళనల కారణంగా మెదడుపై(Brain) విపరీతమైన భారం పడి.. వయసుతో సంబంధం లేకుండా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానంగా ఎక్కువ మందిని ఇబ్బందిపెడుతున్న సమస్య.. మతిమరుపు. ఇందుకు ముఖ్య కారణం మెదడు పనితీరు నెమ్మదించడమే అని చెప్పుకోవచ్చు. మరి.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మెదడుకు శ్రమ : ముందుగా మెదడు యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి చురుకుగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం మెదడుకు కాస్త శ్రమ అవసరమంటున్నారు. ముఖ్యంగా చిన్న లెక్కల కోసం కూడా కాలిక్యులేటర్ యూజ్ చేయడం మానుకోవాలి. అలాగే.. తరచుగా పదవినోదం, సుడోకు, చెస్, పజిల్స్ లాంటివి ఆడుతూ ఉండాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. దీని వల్ల మెదడు పనితీరు క్రమంగా మెరుగవడం మీరు గమనించొచ్చంటున్నారు నిపుణులు.
వ్యాయామం : వ్యాయామం అనేది శరీరానికి మాత్రమే కాదు.. మెదడుకూ ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. శారీరక శ్రమ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచి బ్రెయిన్ కణాలను చురుకుగా ఉంచుతుందంటున్నారు. కాబట్టి.. ఏ వయసు వారైనా రోజువారి జీవితంలో కాస్త శారీరక శ్రమ ఉండేలా చురుకైన నడక, ఈత లేదా యోగా వంటివి చేర్చుకున్నారంటే మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చంటున్నారు.
2021లో 'జర్నల్ ఆఫ్ ఆల్జీమర్స్ డిసీజ్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. డైలీ వ్యాయామం చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని, అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ చార్లెస్ డి. స్టెర్న్ పాల్గొన్నారు. రోజూ వ్యాయామం చేయడం రక్త ప్రసరణ మెరుగుపడి మెదడు ఆరోగ్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ పనులు అలవాటు చేసుకోండి - మీ బ్రెయిన్ సూపర్ పవర్‌గా మారిపోతుంది!
ఆహారం : బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే.. డైలీ పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యమంటున్నారు. అంతేకాదు.. సరైన పోషకాహారం మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచే వాటికి దూరంగా ఉండాలి. ఎందుకుంటే.. బాడీలో ఆకస్మాత్తుగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభిస్తే అది బ్రెయిన్‌కు అంతరాయం కలిగిస్తుందంటున్నారు. అంతేకాదు.. ఇది డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇవేకాకుండా బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే వీలైనంత వరకు మద్యపానానికి దూరంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే.. ఆల్కహాల్ డీహైడ్రేషన్‌కు కారణమయి మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు. అదేవిధంగా రోజూ తగినంత మొత్తంలో వాటర్ తాగేలా చూసుకోవాలని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.