Health Benefits of Climbing Steps for 2 to 3 Floors: ఈ రోజుల్లో మాగ్జిమమ్ జనాలు పై అంతస్తులకు వెళ్లడానికి లిఫ్ట్‌ను యూజ్ చేస్తున్నారు. ఆఫీసు, ఇల్లు, షాపింగ్ మాల్స్.. ఎక్కడైనా సరే లిఫ్ట్ వైపే చూస్తున్నారు. మెట్లు ఎక్కే అవకాశం ఉన్నా లిఫ్ట్ వైపే అడుగులు వేస్తున్నారు. అయితే.. లిఫ్ట్ ఎక్కడం కన్నా మెట్లు ఎక్కితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. రోజులో కనీసం రెండు మూడు ఫ్లోర్లు ఎక్కడం చాలా మంచిదని అంటున్నారు.
గుండె ఆరోగ్యం: రోజూ రెండు మూడు ఫ్లోర్లు మెట్లు ఎక్కడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మెట్లు ఎక్కడం వల్ల రక్త సరఫరా వేగంగా జరుగుతుందని.. గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
కండరాలు బలంగా: మెట్లు ఎక్కడం వల్ల కాళ్ల కండరాలు బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. మోకాళ్లు, మడిమలు, పాదాలు ఇలా అన్నింటికీ బలం పెరుగుతుందని.. ఫాస్ట్‌గా నడవాల్సినప్పుడు ఈజీగా నడుస్తారని అంటున్నారు.
బరువు తగ్గేందుకు: బరువు తగ్గేందుకు, బరువును అదుపులో ఉంచేందుకు రోజూ రెండు మూడు ఫ్లోర్లు మెట్లు ఎక్కడం ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. వ్యాయామం కంటే కూడా మెట్లు ఎక్కడం వల్ల కెలోరీలు ఎక్కువగా ఖర్చవుతాయని చెబుతున్నారు. 2001లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. అధిక బరువుతో బాధపడేవారు మెట్లు ఎక్కడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ జె. లెవి పాల్గొన్నారు.
ఫిట్‌గా: మెట్లు ఎక్కడం వల్ల శరీరం మొత్తానికి సామర్థ్యం చేకూరుతుందని అంటున్నారు. బాడీ ఫిట్‌గా మారుతుందని.. తరచూ వేధించే కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు క్రమంగా అదుపులోకి వస్తాయని అంటున్నారు.
స్ట్రాంగ్ బోన్స్: మెట్లు ఎక్కడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. ఎముకల్లో బలం లేనప్పుడు పెళుసుగా మారి చిన్న చిన్న దెబ్బలకే విరిగిపోతుంటాయని.. అలా కాకుండా రోజూ మెట్లెక్కడం ద్వారా ఈ సమస్యను అదుపులోకి తీసుకురావచ్చంటున్నారు.
బ్యాలెన్సింగ్: మెట్లెక్కడం ద్వారా నడిచేటప్పుడు కూడా శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొందరికి కొంచెం దూరం నడవగానే కాళ్లల్లో సత్తువ లేకుండా పోతుందని.. మెట్లు ఎక్కడం వల్ల క్రమంగా ఇది కూడా తగ్గిపోతుందని అంటున్నారు.
ఒత్తిడి మటుమాయం: మెట్లెక్కినప్పుడు ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుందని.. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారని.. ఒత్తిడి కూడా తగ్గుతుందని అంటున్నారు.
డైలీ ఒక అరటి పండు తినాలంటున్న నిపుణులు - ఎందుకో తెలుసా? - Benefits Of Eating Banana