Ginger Water Health Benefits : అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు ఎన్నో వ్యాధులను దూరం చేస్తాయి. ఆయుర్వేదం, యునాని మాత్రమే కాదు అలోపతీ సైతం ఆరోగ్యానికి అల్లం(Ginger) మేలు చేస్తుందని చెబుతోంది. అయితే అల్లాన్ని ఎక్కువగా కూరల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా టీలో కూడా వేసుకుంటారు. అయితే అల్లం టీ లాగే అల్లం నీరు తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వికారం తగ్గిస్తుంది : చాలా మంది మార్నింగ్ సిక్ నెస్‌తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఉదయం లేవగానే పరగడుపున ఒక కప్పు గోరు వెచ్చని అల్లం వాటర్ తీసుకుంటే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. అంతే కాదు, మోషన్ సిక్నెస్ లేదా కీమో సంబంధిత ప్రతికూల ప్రభావాలను కలిగి ఉన్నవారికి ఇది సహాయపడుతుంది. పురాతన కాలం నుంచి మసాలా దినుసులలో ఒకటిగా ఉన్న అల్లం, వికారం వంటి లక్షణాలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది : మీరు రోజూ పరగడుపున ఒక కప్పు అల్లం వాటర్ తీసుకోవడం కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు. ఎలాగంటే అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమెటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.
చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది : మీరు డైలీ పరిగడుపున కప్పు గోరు వెచ్చని అల్లం వాటర్ తీసుకున్నారంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే అల్లంలో ఉండే పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఫలితంగా గుండె జబ్బులు, ఇతర కొలెస్ట్రాల్ సంబంధిత ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు.
Ginger Side Effects In Telugu : అల్లాన్ని ఎక్కువగా వాడుతున్నారా?.. అయితే జాగ్రత్త సుమా!
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది : NIH ప్రకారం, రోజూ మార్నింగ్ ఒక గ్లాసు అల్లం నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అదే విధంగా గుండెల్లో మంట, వికారం, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
పిరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది : పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పిని తగ్గించడంలో కూడా అల్లం చాలా బాగా సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల్లో కూడా ఇదే విషయం వెల్లడైంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో అల్లం టీ, అల్లం వాటర్ తాగడం వల్ల మీరు మంచి అనుభూతిని పొందడమే కాకుండా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు.
ఇవే కాకుండా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు.. నీటిలో అల్లం వేసి మరిగించి, కాస్త నిమ్మ రసం కలిపి తాగితే మంచి ఫలితాలుంటాయి. అదే విధంగా బరువు తగ్గించేందుకు అల్లం చక్కగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం అల్లం వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల అనవసరమైన కొవ్వు కరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అల్లం వాటర్ ఎలా తయారు చేసుకోవాలంటే :
- కొంచెం అల్లాన్ని కచ్చాపచ్చగా దంచుకోవాలి.
- తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి ఓ గ్లాసున్నర వాటర్ పోసి అందులో అల్లం వేసి కాసేపు మరిగించుకోవాలి.
- తర్వాత ఆ నీళ్లను వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
- అయితే రుచి కోసం అదనంగా అందులో తేనె, పుదీనా ఆకులు యాడ్ చేసుకోవచ్చు.