Health Benefits of Crying : "కన్నీళ్లు".. తట్టుకోలేని బాధకు చిహ్నం. భరించలేని కష్టం కలిగినప్పుడు.. మనసు తీవ్ర భావోద్వేగానికి గురైనప్పుడు బరస్ట్ అవుతారు. భోరున ఏడ్చేస్తారు. మరికొందరు మానసిక వేదనతో కుమిలిపోతుంటారు. తీవ్రంగా బాధపడుతున్నా.. కంట్లోంచి చుక్కనీరు రాదు. మరి.. ఏడిస్తే మంచిదా? వేదన మనసులోనే దాచుకుంటే మంచిదా అంటే.. ఏడ్చేయాలంటున్నారు నిపుణులు.
రిఫ్లెక్స్ టియర్స్ : కన్నీటిలో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి. అందులో రిఫ్లెక్స్ టియర్స్ ఒకటి. ఇవి సాధారణంగా మనం ఉల్లిపాయలు కోసినప్పుడు, పొరపాటున కళ్లలో ఏదైనా దుమ్ము పడినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు వస్తాయి. ఇవి కళ్లలో పడ్డ దుమ్ము, ధూళి బయటకు వచ్చేందుకు, కళ్ల మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
బాసల్ టియర్స్ : వీటిని శుభ్రం చేసే కన్నీరు అంటారు. నిమిషానికి ఒకటి నుంచి రెండు మైక్రోలీటర్ల వరకు ఉత్పత్తి అవుతాయట. ఈ కన్నీళ్లు కళ్లను తేమగా ఉంచడంతోపాటు ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయట. ఇవి కన్నీటి నాళాల పనితీరును నిర్వహించడంలో సహాయపడతాయి.
ఎమోషనల్ టియర్స్ : వీటిని భావోద్వేగ కన్నీళ్లు అంటారు. ఈ కన్నీళ్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భావోద్వేగాలకు గురైనప్పుడు కార్టిసాల్, ఇతర టాక్సిన్స్ వంటి ఒత్తిడి హార్మోన్లు కలిగించే రియాక్షన్ కారణంగా ఈ కన్నీళ్లు వస్తాయి. కాబట్టి వీటివల్ల మనసులోని ఒత్తిడి తగ్గుతుందట. కాబట్టి.. ఏడుపు మంచిదే అంటారు నిపుణులు. ఇంకా.. ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే..
మానసిక ఒత్తిడి తగ్గుతుంది : యూఎస్ఏలోని యేలె యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో కన్నీళ్లు మనిషి భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయని తేలింది. ఏడవటం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గి మనసు కుదుట పడుతుందని పేర్కొన్నారు పరిశోధకులు.
నొప్పిని తగ్గిస్తాయి : ఎక్కువసేపు ఏడవటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్, ఎండోజెనస్ ఒపియడ్స్ రిలీజ్ అవుతాయి. వీటినే ఎండార్ఫిన్స్ అనీ పిలుస్తారు. ఇవి శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కలిగిస్తాయి. దీంతో భోరున ఏడ్చేసిన తర్వాత.. కాస్త చల్లబడి మౌనంగా ఉండిపోతారు. అలాగే ఇవి శారీరక, మానసిక నొప్పిని తగ్గించడంలోనూ సహాయపడతాయట.
మెదడు వేడి తగ్గుతుంది : ఏడ్చినప్పుడు తరచుగా మీరు చల్లటి గాలిని వేగంగా పీల్చుకుంటారు. అది మెదడు ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త సంతులితమవుతుంది. దాంతో సంయమనంతో ఆలిచిస్తాం. అదేవిధంగా ఇది శరీరానికి, మనస్సుకు మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.
రక్తపోటును తగ్గిస్తుంది : మీకు ఏడవాలనిపిస్తే ఏడవండి అంటున్నారు నిపుణులు. దానివల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుందట. అలాగే గుండె సంబంధిత సమస్యల బారిన పడటాన్ని కూడా తగ్గిస్తుందట.
నిద్రపోవడానికి : పిల్లలు ఏడుస్తుంటే కొన్నిసార్లు ఏడవనీ అని తల్లిదండ్రులు ఊరుకుంటారు. ఇలా ఏడ్చి ఏడ్చి పిల్లలు నిద్రపోతే.. ఆ నిద్ర ఎంతో ప్రశాంతంగా ఉంటుందట. ఎక్కువ సేపు నిద్రపోగలరట. ఓ సర్వే ప్రకారం ఏడ్చి పడుకున్న వారికి మంచి నిద్ర పట్టడంతోపాటు లేచినప్పుడు మానసిక ఉల్లాసం కలుగుతుందట.
బ్యాక్టీరియా నుంచి రక్షణ : కన్నీటిలో ఐసోజిమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనికి యాంటిమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. దీంతో కళ్లలోకి బ్యాక్టీరియా చేరితే ఐసోజిమ్ వాటితో పోరాడి కళ్లకు హాని జరగక్కుండా చూసుకుంటుంది.
మీ పిల్లలు చీటికి మాటికి ఏడుస్తున్నారా? పేరెంట్స్‌గా మీరు ఈ పనులు చేయాల్సిందే!