Health Benefits of Bajra : ఆరోగ్యకరమైన చిరుధాన్యాలలో సజ్జలు కూడా ఒకటి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ ఇ, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సజ్జలతో చేసిన ఆహారం తినడం వల్ల మనకు ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుందట. అయితే, సజ్జలను తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ? బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఎలా తీసుకోవచ్చు ? అనే విషయాలను ప్రముఖ డైటీషియన్ 'డాక్టర్ శ్రీలత' వివరిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
గ్లూటెన్-ఫ్రీ :
సాధారణంగా చాలా రకాల ధాన్యాల్లో గ్లూటెన్ ఉంటుంది. కానీ, సజ్జల్లో గ్లూటెన్ ఉండదు. చాలా మందికి గ్లూటెన్ ఉండే ఆహారాల వల్ల ఎలాంటి హాని ఉండదుకానీ.. కొంతమంది శరీరానికి సరిపడదు. వీరికి గ్లూటెన్ అలర్జీ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. సజ్జల్లో గ్లూటెన్ ఉండదు. కాబట్టి దీనిని అందరూ తినవచ్చు.
బరువు పెరగకుండా అదుపులో :
నీటిలో లేదా పొట్టలోని ద్రవాల్లో త్వరగా కరగని పీచు పదార్థం సజ్జలలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. అలాగే పీచు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. దీనివల్ల బరువు పెరగకుండా అదుపులో ఉంచుకోవచ్చు.
పిండి జల్లించకూడదట!
చాలా మంది సజ్జలను మర ఆడించిన తర్వాత.. జల్లెడ పట్టి పిండిని ఉపయోగిస్తుంటారు. కానీ, ఇలా చేయకూడదు. సజ్జ పిండిని జల్లించి ఉపయోగించడం ద్వారా కొన్ని రకాల విటమిన్లు, మినరల్స్, వంటి పోషకాలను కోల్పోతాము. కాబట్టి పిండి జల్లించకుండానే వాడుకోవాలి.
మొలకల రూపంలోనూ..
వెయిట్‌లాస్ కోసం ప్రయత్నించేవారు సజ్జలను మొలకల రూపంలోనూ తీసుకోవచ్చు. మొలకవచ్చిన సజ్జల్లో కొన్ని ఉడికించిన కూరగాయలు, బఠానీలు కలిపి తినొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల పోషకాలు రెట్టింపవుతాయి. ఈ మొలకలను ఇడ్లీ పిండిలో, దోశ పైన కూడా వేసుకుని తినొచ్చు.
"బరువు తగ్గాలనుకునే వారికి సజ్జలు మంచి ఆహారం. డైలీ వీటిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ బాధితులూ వీటిని తినొచ్చు. ఎందుకంటే, సజ్జల గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువ. సజ్జలతో చేసిన ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు నెమ్మదిగా పెరుగుతాయి. సజ్జలతో దోశ, అన్నం, చపాతీ వంటివి ఏవైనా చేసుకుని ప్రతిరోజు ఓ పూట తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది."- డాక్టర్ శ్రీలత
గుండెకు మేలు:
సజ్జల్లో మెగ్నీషియం చాలా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే మెగ్నీషియం అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రించి గుండెపోటు, స్ట్రోక్ వంటి అనారోగ్యాలను నివారించడంలో సహాయం చేస్తుంది.
- సజ్జల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- వింటర్ సీజన్లో సజ్జలతో చేసిన ఆహారం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
- సజ్జలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రాసెస్ చేసిన ఆహారం, బ్రెడ్, కేకులు తీసుకోవడం తగ్గించవచ్చు. దీనివల్ల ఆరోగ్యకరమైన బరువుని కొనసాగించవచ్చు.
- చివరిగా బరువు తగ్గాలనుకునేవారికి, అలాగే ప్రస్తుతం ఉన్న బరువుకి మించి పెరగకూడదనుకునేవారికి సజ్జలు చక్కని ఆహారమని డాక్టర్ శ్రీలత సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
జొన్న రొట్టెలు రోజూ తినడం వల్ల జరిగేది ఇదేనట! - నిపుణుల సూచనలు మీకోసం
చపాతీలను నేరుగా గ్యాస్ మంటపై కాలిస్తే క్యాన్సర్ వస్తుందా? - పరిశోధనలో కీలక విషయాలు!