Guava Leaves Benefits For Face : యుక్త వయసులో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలను వేధించే సమస్యల్లో మొటిమలు ఒకటి. ఇవి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొంతమందిలో మొటిమలు చిన్న సైజులో కనిపిస్తూ తక్కువగా ఉంటే.. మరికొంత మందిలో పెద్దగా ఉంటాయి. దీంతో ఫేస్ కళ కోల్పోతుంది. దీంతో.. నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బందిపడుతుంటారు. ఈ సమస్యతో బాధపడేవారు వీటిని తగ్గించుకోవడానికి ఏవేవో ఫేస్ ప్యాక్స్, క్రీమ్స్, వంటింటి చిట్కాలు ట్రై చేస్తుంటారు. అయినప్పటికీ.. కొంతమందిలో ఎలాంటి మార్పూ కనిపించకపోగా మొటిమలు మరింత ఎక్కువ అవుతాయి. ఇలాంటి వారు జామ ఆకులతో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మొటిమలను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
జామ ఆకుల రసంతో..
జామ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయని.. ఇవి మొటిమల్ని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. కొన్ని జామాకుల్ని తీసుకుని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. జామాకుల రసం తీసి దానికి రెండు చెంచాల ఆవుపాలు కలపాలి. తర్వాత ఈ రసాన్ని ముఖానికి పట్టించాలి. ఇది సెబమ్ ఉత్పత్తినే కాదు, మొటిమల వల్ల వచ్చే వాపును కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
జామాకుల నీళ్లు..
ఈ రోజుల్లో చాలా మంది గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారు. అయితే.. కంప్యూటర్ నుంచి వచ్చే నీలికాంతి వల్ల ముఖంపై పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. దీంతో ఫేస్ నల్లగా మారుతుంది. అయితే, ఈ నలుపు తగ్గించడానికి అద్భుతమైన ఒక చిట్కా ఉందని ఆయుర్వేద నిపుణులంటున్నారు. నాలుగు జామాకుల్ని తీసుకుని ఒక గిన్నెనీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు.
బ్లాక్‌హెడ్స్ పోవాలంటే..
మొటిమల తర్వాత ఎక్కువగా అమ్మాయిలను ఇబ్బంది పెట్టే మరో సమస్య బ్లాక్‌హెడ్స్. ఫేస్‌పై అక్కడక్కడా ఉండే నల్ల మచ్చలనే బ్లాక్‌హెడ్స్ అంటారు. అయితే.. ఈ సమస్యకు జామాకు, కలబందతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనికోసం టేబుల్ స్పూన్ జామాకు పేస్ట్‌ని తీసుకోవాలి. తర్వాత అంతే మొత్తంలో కలబంద గుజ్జు, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
స్కార్ఫ్ ధరిస్తే మొటిమలు వస్తున్నాయా? - క్రీమ్స్ వాడకుండా ఇలా తగ్గించుకోండి!