Eating Habits to Change to Get Rid of Gastric Problem: ప్రతి ఒక్కరికీ ఉండే సాధారణ సమస్యల్లో గ్యాస్ట్రిక్ ఒకటి. మన జీవనశైలి మార్పులు, నిద్రలేమి, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్, పీహెచ్ హై లోడింగ్, ఒత్తిడి కారణంగా కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. గ్యాస్ట్రిక్ కారణంగా పొత్తికడుపులో నొప్పి, ఛాతీలో మంట, తేన్పులు రావడం, ఆహారం తీసుకున్న తర్వాత ఆయాసం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. అయితే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి రిలీఫ్ పొందాలంటే ఆహార అలవాట్లలో(National Institute of Health రిపోర్ట్) ఈ మార్పులు చేసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చిన్న చిన్న భోజనాలు: చాలా మంది ఒకేసారి తినేస్తే ఓ పని అయిపోతుంది అనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో తింటుంటారు. దీంతో ఒకేసారి ఎక్కువ ఆహారం తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు 5 నుంచి 6 సార్లు చిన్న మొత్తంలో ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
2015లో జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజువారీ ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్దికొద్దిగా తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోయి జీవక్రియ మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసన్‌లో డాక్టర్ Kenichi Katakami పాల్గొన్నారు.
మసాలా ఆహారాలకు దూరం: మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య మరింత తీవ్రమవుతుందని... కాబట్టి మసాలా ఆహారాలకు దూరంగా ఉండి తక్కువ మొత్తంలో ఉన్నవి తినడం మంచిదని సూచిస్తున్నారు.
కొవ్వు ఆహారాలు తగ్గించడం: కొవ్వు ఆహారాలు జీర్ణించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వీటిని తగ్గించడం మంచిది. ముఖ్యంగా వేయించిన ఆహారాలు, ఫ్రైడ్ చికెన్, పిజ్జా వంటి ఆహారాలను తినడం మానుకోవాలి. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా చేయవచ్చు.
బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఫుడ్స్ తింటున్నారా? - గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గ్యారెంటీ!
ఆమ్లత ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవద్దు: టమాటలు, నిమ్మకాయలు, కూరగాయల ఆమ్లాలు, కాఫీ, టీ, కార్బొనేటెడ్ పానీయాలు వంటివి కడుపులో ఆమ్లతను పెంచుతాయి. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యను అధికం చేస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు.
పాల ఉత్పత్తులను తగ్గించడం: కొంతమందికి పాలు, పాల ఉత్పత్తులు ఎసిడిటీని పెంచుతాయి. కాబట్టి వీటిని తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు.
ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు: బిస్కెట్లు, బ్రెడ్, పాస్తా వంటి ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. కాబట్టి ఈ ఆహారాలకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు.
ఒత్తిడిని నిర్వహించడం: ఒత్తిడి గ్యాస్ట్రిక్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత మేర ఒత్తిడి లేకుండా చూసుకోవాలని.. అందుకోసం యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిదని సూచిస్తున్నారు.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే కడుపు క్యాన్సర్ కావొచ్చు!
ఇవి కూడా: కాలీఫ్లవర్, క్యాబేజీ, యాపిల్స్, పచ్చి కీరా, ఉల్లిపాయలు, కార్న్‌ఫ్లేక్స్ వంటివి కూడా తినొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్, ఫ్రక్టోజ్, ఫైబర్ కంటెంట్ వంటివి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడతాయని.. అలాగే కడుపులో గ్యాస్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయని అంటున్నారు. కాబట్టి వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నారు.
ఇవి తినండి:
- కొన్ని రకాల పండ్లు, కూరగాయలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని అంటున్నారు.
- రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని.. గ్యాస్ట్రిక్ సమస్య దరిచేరదని సూచిస్తున్నారు.
- ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలా అని ఒకేసారి అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల కూడా గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవసరం మేర తీసుకోవడం మంచిది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కడుపు నొప్పి ఉంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చినట్లేనా? నిపుణులు ఏమంటున్నారు..?
గ్యాస్ సమస్య వేధిస్తోందా? అయితే ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టేయండి!