Easy Exercises For Improve Eye Vision : నేటి డిజిటల్ యుగంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరిగిన ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం కారణంగా చాలా మంది వివిధ కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కొన్ని వ్యాయామాల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పామింగ్ : కళ్లకు సంబంధించిన ఈ సులభమైన వ్యాయామం కంటి చూపును మెరుగుపరచడానికి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. ముందుగా ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉండే నేలపై కూర్చొని మీ కళ్లు మూసుకుని నెమ్మదిగా డీప్ బ్రీత్ తీసుకుంటూ వదులుతూ ఉండాలి. అలాగే ఆ టైమ్‌లో మీ అరచేతులు వెచ్చగా మారేలా వాటిని గట్టిగా రుద్ది.. మీ మూసిన కనురెప్పల మీద సున్నితంగా ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ చేతుల వెచ్చదనాన్ని కళ్లు గ్రహించి.. కంటి కండరాలకు మంచి విశ్రాంతిని కలిగిస్తాయట. ఈ ప్రక్రియను 5 నుంచి 10 నిమిషాల పాటు రిపీట్ చేయడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.
ఐ రోల్ : ఇది కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా నేలపై కూర్చొని వెన్నముకను నిటారుగా ఉంచాలి. ఆపై మీ చేతులను ఒడిలో ఉంచి, తలను కదలకుండా 10-15 సెకన్ల పాటు మొదట సవ్యదిశలో వృత్తాకార కదలికలో మీ కళ్లను నెమ్మదిగా తిప్పండి. ఆపై మరో 10-15 సెకన్ల పాటు అపసవ్య దిశలో తిప్పండి. అలాగే మీ కళ్లను రిఫ్రెష్ చేయడానికి కొన్ని సార్లు బ్లింక్ చేయండి. ఇలా ఈ ప్రక్రియను 5 నుంచి 10 నిమిషాల పాటు పునరావృతం చేయండి. ఫలితంగా ఈ మీ కంటి కండరాలకు మంచి వ్యాయామం లభించి కళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో కంటిచూపు మెరుగుపడుతుందంటున్నారు.
డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ కళ్లు దెబ్బతినడం ఖాయం!
రెప్పలు వేయడం : ఈ సులభమైన వ్యాయామం కూడా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ప్రత్యేకించి డిజిటల్ స్క్రీన్లను ఉపయోగిస్తున్నప్పుడు, ఎక్కువసేపు ఏదైనా వస్తువుపై దృష్టి కేంద్రీకరించే సమయంలో ప్రతి కొన్ని సెకన్లకు కళ్లను బ్లింక్ చేయాలంటున్నారు. రెప్పలు వేయడం వల్ల కళ్ళు రిఫ్రెష్ అవుతాయి. అలాగే.. పొడిబారకుండా చేస్తుంది. కంటిపై ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు.
2019లో "ఓపెన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. రోజుకు రెండుసార్లు 10 నిమిషాలు రెప్పపాటు చేసిన వ్యక్తులు కంటి ఒత్తిడి, దృష్టి అలసట స్థాయిలలో గణనీయమైన తగ్గుదలను అనుభవించారు. ఈ పరిశోధనలో యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సిన్సిన్నాటికి చెందిన ప్రముఖ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ జాన్ టి. షెన్ పాల్గొన్నారు. రెప్పలు వేసే సులభమైన వ్యాయామం కంటిపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
దృష్టి కేంద్రీకరించడం : పెన్ను వంటి చిన్న వస్తువును చేతికి అందేంత దూరంలో పట్టుకుని దానిపై దృష్టి పెట్టాలి. ఆపై ఫోకస్ చేస్తూనే ఆ వస్తువును నెమ్మదిగా మీ ముక్కు వైపునకి తీసుకురావాలి. అలాగే ఆబ్జెక్ట్‌ను ఫోకస్‌లో ఉంచుతూ మళ్లీ దూరంగా తీసుకెళ్లాలి. ఇలా 10-15సార్లు రిపీట్ చేయాలి. ఇదీ కంటి ఆరోగ్యానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
అప్-డౌన్ మూవ్మెంట్ : ఈ వ్యాయామం కూడా కంటి కండరాలకు మంచి విశ్రాంతినిచ్చి కళ్లను ఆరోగ్యవంతంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా చదునైన నేలపై నిటారుగా నిల్చొని పైకప్పు వైపు చూడాలి. ఆ తర్వాత మీ చూపును నేలపైకి తీసుకురావాలి. ఇలా 10 నుంచి 15 సార్లు రిపీట్ చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మధ్యలో రెప్పవేయకూడదు. పూర్తయిన తర్వాత కళ్లు మూసుకుని వాటిని మీ అరచేతులతో సున్నితంగా నొక్కాలి. ఇలా చేయడం ద్వారా కళ్లపై ఒత్తిడి తగ్గుతుందంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : చిన్న వయసులోనే కంటి సమస్యలా? - ఈ ఆయుర్వేద టిప్స్ పాటించాల్సిందే! - Ayurveda for Eye Care