Excessive Stress Symptoms : మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి. ప్రస్తుత జీవనశైలి ఒత్తిడి (స్ట్రెస్) లేకుండా ఉంటున్న వారు చాలా అరుదనే చెప్పాలి. అలా ఎదుర్కొంటున్న ఒత్తిడి మితిమీరిపోతే బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఒత్తిడి కూడా మీకు డైలీ లైఫ్‌లో భాగమైపోయి అది మీరు తెలుసుకోలేకపోతే మీ శరీరంలో కనిపించే ఈ లక్షణాలతో దానిని పసిగట్టొచ్చు.
శరీరంపై స్ట్రెస్ ప్రభావం
జీవన విధానంలో భాగమైపోయిన స్ట్రెస్‌ను ఎంతవద్దన్నా తగ్గించుకోగలం కానీ, తొలగించుకోలేం. ఆ లోపే శరీరంలో చాలా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ ఒత్తిడి కారణంగా కార్టిసాల్, అడ్రినలైన్ వంటి హార్మోన్లు రిలీజ్ అయి శరీరంపై దుష్ప్రభావం చూపిస్తాయి.
స్ట్రెస్ లక్షణాలు
ఒత్తిడి కారణంగా తలనొప్పులు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు కలుగుతాయి. వాటి ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారి గుండె జబ్బులకు కూడా దారి తీసే ప్రమాదముంది. శరీరంలో కనిపించే ఈ లక్షణాలను బట్టి జాగ్రత్తలతో బయటపడొచ్చు.
జీర్ణ సంబంధిత సమస్యలు
నిపుణులు చెబుతున్న దానిని బట్టి ఒత్తిడి మన జీర్ణ వ్యవస్థ మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కడుపునొప్పి, వికారంగా ఉండటం, అజీర్ణం, అసంపూర్తిగా మలవిసర్జన కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒత్తిడి కారణంగా జీర్ణ వ్యవస్థకు చేరాల్సిన రక్తం చేరకుండా దూరం కావడం వల్ల అజీర్ణ సమస్యలు వస్తాయి. కండరాల్లో నొప్పులు కండరాలు పట్టేయడం లేదా నొప్పిగా ఉండటం వంటివి కూడా ఈ లక్షణాలే. ప్రత్యేకించి మెడ, భుజాలు, వెన్నునొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి.
తలనొప్పులు - మైగ్రేన్స్
ఒత్తిడి వల్ల తరచూ తలనొప్పులు, మైగ్రేన్లు కలుగుతుండొచ్చు. తలలో ఉండే కండరాలు, మెడ బిగుసుకుపోవడం, ఇబ్బందిగా ఉండటం వంటివి జరుగుతాయి. ఇదంతా స్ట్రెస్ వల్ల జరిగేదే.
గుండెజబ్బులు
ఒత్తిడి కారణంగా గుండె కొట్టుకోవడం పెరిగి బీపీకి కారణమవుతుంది. చాలా రోజుల పాటు ఉండే స్ట్రెస్ గుండె సమస్యలకు, గుండె నొప్పులకు కారణమవుతుంది. అడ్రినలైన్ ఉత్పత్తుల్లో హెచ్చుతగ్గులు సంభవించి కూడా గుండె కొట్టుకోవడంలో మార్పులు కలగొచ్చు.
రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం
ఏళ్ల తరబడి ఉండే ఒత్తిడి కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. ఇన్ఫెక్షన్లకు తొందరగా ప్రభావితమై జబ్బులు రావడానికి కారణమవుతుంది. స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ కారణంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.
బరువులో మార్పులు
స్ట్రెస్ పెరుగుతుండటం వల్ల శరీరంలో బరువు పెరగడం లేదా తగ్గడం లాంటివి వెంటనే గమనించగలం. స్ట్రెస్‌ను అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఎమోషనల్‌గా తినడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ట
పునరుత్పత్తి వ్యవస్థలో సమస్యలు
మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థలో సమస్యలు వస్తాయి. లిబిడో కూడా తగ్గిపోయి ఇబ్బందికరమైన స్థితిలో నెలసరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మగవారిలో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి వీర్యకణాలు ఉత్పాదకత తగ్గిపోతుంది.
చర్మ సమస్యలు
స్ట్రెస్ వల్ల ఎక్జిమా, సోరియాసిస్, మొటిమలు లాంటి చర్మ సమస్యలు వస్తాయి. స్ట్రెస్ పెరగడం వల్ల హార్మోన్లలో మార్పులు కలిగి శరీరంలో నూనె ఉత్పత్తులు పెరిగి దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్ సైట్ లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.