Does Eating too Many Eggs Cause Diabetes?: మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతులు ఆహారం కంపల్సరీ. అయితే హెల్దీ ఫుడ్స్‌లో కోడిగుడ్లు ఒకటి. వీటిని ఎంతో మంది ఇష్టంగా తింటారు. బ్రేక్‌ఫాస్ట్ మొదలు డిన్నర్ వరకు ఏదో ఒక సమయంలో వీటిని ఆహారంలో భాగం చేసుకుంటారు. ఆరోగ్య నిపుణులు సైతం రోజూ ఓ గుడ్డు తినడం మంచిదని చెబుతుంటారు. కారణం ఇందులోని పోషకాలు. అయితే.. ఒక పరిశోధనలో మాత్రం గుడ్లు అధికంగా తింటే మధుమేహం బారినపడే ప్రమాదం ఉందని తేలింది. ఎవరైతే రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తింటారో వారిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా పురుషుల్లో కంటే మహిళల్లో ఈ రిస్క్ ఎక్కువని తెలిపారు. మరి ఆ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
18 సంవత్సరాల రీసెర్చ్: గుడ్లను అతిగా తీసుకోవడంపై యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నేతృత్వంలో చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖతార్ యూనివర్సిటీ సంయుక్తంగా 18 సంవత్సరాల పాటు అధ్యయనం చేశాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్‌తోపాటు అతిగా గుడ్లను వినియోగించడం టైప్-2 డయాబెటిస్ పెరగడానికి కారణమవుతున్నదని వారి 18 సంవత్సరాల పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు. తరచూ గుడ్లను ఆహారంగా తీసుకునే వారిలో మధుమేహం రిస్క్ పెరుగుతున్నట్లు, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువగా ఉంటున్నట్లు తేలిందని పేర్కొన్నారు.
ఈ పరిశోధన వివరాలు 2017లో "Journal of the American College of Cardiology" లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ ఒక గుడ్డు తినే వ్యక్తులతో పోలిస్తే, రోజుకు రెండు గుడ్లు తినే వ్యక్తులకు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 23% ఎక్కువగా ఉంటుందని, రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తినే వ్యక్తులకు ప్రమాదం 31% ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనా మెడికల్ యూనివర్సిటీలో పోషకాహార నిపుణుడు డాక్టర్ మింగ్ లీ పాల్గొన్నారు. ఈ పరిశోధనలో చైనాకు సంబంధించిన సగటున 50 సంవత్సరాల వయసు కలిగిన సుమారు 8,545 మంది పాల్గొన్నారని మింగ్ లీ చెప్పారు.
గుడ్లను ఎలా తినాలి..? మధుమేహం వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే గుడ్లను ఉడకబెట్టుకుని మాత్రమే తినడం ఉత్తమమని.. దానికి ఉప్పు, కారం, కొత్తిమీర లాంటివి జోడించి తీసుకోవాలని మింగ్ లీ సూచించారు. లేదంటే గుడ్లను కూరగాయలతో కలిపి తీసుకోవాలని సలహా ఇచ్చారు. అలాగే కోడిగుడ్లతో వెజిటబుల్ ఆమ్లెట్ లాంటివి చేసుకోవాలని సూచించారు. గుడ్లను నేరుగా కాకుండా కూరగాయలతో కలిపి తీసుకోవడం ద్వారా మధుమేహం రిస్క్ తక్కువన్నారు. గుడ్లతో చేసుకునే డిష్‌లలో నెయ్యి, నూనె, చీజ్ లాంటివి వాడకూడదని హెచ్చరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"క్రాష్ డైట్"తో నిజంగా బరువు తగ్గుతారా? - ఆరోగ్యానికి మంచిదేనా? - What is CrashDiet