Pumpkin Face Mask DIY : చర్మం కాంతివంతంగా ఆకర్షణీయంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ అదే సమయంలో మార్కెట్లో దొరికే కెమికల్ కాంబినేషన్ క్రీంలు వాడితే చర్మం ఏమవుతుందో అనే భయం కూడా ఉంటుంది. అలాంటి వారి కోసమే సహజ సిద్ధంగా వేసుకునే మాస్క్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం. నిత్యం అందుబాటులో ఉండే గుమ్మడికాయ తినడానికే కాదు మీ అందాన్ని రెట్టింపు చేసేందుకు ముఖానికి మాస్క్‌గా కూడా ఉపయోగపడుతుందట. ఇమ్యూనిటీ పెంచే విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సీ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం, బీటా కెరోటిన్ ఉండే గుమ్మడికాయ గురించి తెలుసుకుందాం.
ఇది చర్మానికి ఎందుకు మంచిదంటే?
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే గుమ్మడికాయ మాస్క్ చర్మంపై ముడతలు, గీతలు తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా మృదువైన, కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ విటమిన్-ఏను అందించి డ్యామేజ్ అయిన చర్మంపై కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా పిగ్మంటేషన్ సమస్యను కూడా దూరం చేస్తుంది. దాంతో పాటుగా ఇందులో ఉండే జింక్ సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు రాకుండా చేస్తుంది. గుమ్మడికాయలో ఉండే సహజమైన ఎంజైములు చర్మానికి తగు వనరులు అందించి ఆరోగ్యవంతమైన చర్మాన్ని, జుట్టుని అందిస్తుంది. మరి దాని తయారీ విధానమేంటో తెలుసా?
కావాల్సిన పదార్థాలు:
- పావు కప్పు గుమ్మడికాయ
- ఒక టేబుల్ స్పూన్ తేనె
- కొద్దిగా దాల్చిన చెక్క
తయారీ విధానం, వాడకం:
గుమ్మడికాయ, తేనె, దాల్చిన చెక్క పొడి ఈ మూడింటిని ఎటువంటి ముద్దలు లేకుండా మెత్తటి మిశ్రమంలా కలపాలి. ఈ మిశ్రమాన్ని తరచూ ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేయాలి. ఒక 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ పేస్టును ఫ్రిజ్‌లో ఒక ఐదు రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. గాలి బయటకు పోని డబ్బాలో ఉంచడం మర్చిపోకండి. ఈ మాస్క్ వేసుకుని తీసేసిన తర్వాత స్కిన్ టోనర్‌ను గానీ, మాయిశ్చరైజర్‌ను గానీ చర్మంపై ఒక లేయర్ లాగా అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. గుమ్మడికాయ ఆకులు మలబద్ధకానికి, పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇక గుమ్మడికాయ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు. ఇలా గింజలు, ఆకులు, కాయ అన్నింటి వల్ల లాభాలున్న గుమ్మడి కాయ మార్కెట్లో కనబడితే అస్సలు వదలకండి మరి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.