Diabetes Warning Signs in Children : ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని డయాబెటిస్ సమస్య వేధిస్తోంది. పలు కారణాలతో చిన్న పిల్లలకు కూడా షుగర్ వస్తోంది. ఇందుకు ప్రధానం కారణం ఇన్సులిన్ ఉత్పత్తిలో వచ్చే హెచ్చు తగ్గులే. ఇది శరీరానికి శక్తి కోసం గ్లూకోజ్‌ను రక్తం నుంచి కణాలలోకి తరలించడానికి సహాయపడే హార్మోన్. అయితే.. గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించకపోతే.. అది రక్తంలో పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు తీవ్రమైన అనారోగ్యం కలిగిస్తుంది. కాబట్టి.. మధుమేహం ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకోవడమే కాదు.. పిల్లల్లో వీలైనంత త్వరగా వాటిని గుర్తించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పిల్లల్లో కనిపించే డయాబెటిస్ లక్షణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
విపరీతమైన దాహం : డయాబెటిస్ ఉంటే ఎక్కువగా దాహం వేస్తుంటుంది. దాంతో నీరు ఎక్కువగా తాగుతుంటారు. మీ పిల్లలు ఇలా వాటర్ తాగుతుంటే అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు.
అధిక మూత్ర విసర్జన : పిల్లల్లో కనిపించే డయాబెటిస్ మరో ప్రారంభ హెచ్చరిక సంకేతం.. అధిక మూత్రవిసర్జన. ఈ లక్షణం కనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు. ఇక ఈ పరిస్థితుల్లో గ్లూకోజ్ యూరిన్‌లో విసర్జించడం జరుగుతుంది. ఇది క్రమంగా పిల్లల్లో తీవ్రమైన డీహైడ్రేషన్‌కు కారణమయ్యే అవకాశం ఉంటుంది. చివరికి ఇది మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
విపరీతమైన ఆకలి : ఇది కూడా పిల్లల్లో కనిపించే డయాబెటిస్ లక్షణం. ఎందుకంటే వారి శరీరంలోని గ్లూకోజ్ బయటకు పోవడంతో వారికి ఆకలి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా వారు ఎక్కువ తింటారంటున్నారు నిపుణులు. వైద్యుల ప్రకారం.. విపరీతమైన ఆకలి తగ్గదు. వెంటనే చికిత్స లేదా రోగనిర్ధారణ అవసరం. కాబట్టి ఈ లక్షణం కనిపించినా వెంటనే జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు.
చూపు మందగించడం : పిల్లల్లో మధుమేహానికి మరో చిహ్నం కళ్లు కనిపించకపోవడం. చాలా సార్లు చిన్నారులు తమకు సరిగా కనిపించడం లేదని చెబుతారు. ఆ సమయంలో వెంటనే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే షుగర్ వ్యాధి ఉన్నా ఈ సమస్య కనిపించే అవకాశం ఉంటుందంటున్నారు.
బరువు తగ్గడం : ఇది కూడా పిల్లల్లో కనిపించే డయాబెటీస్ ముఖ్య లక్షణం. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు ఉన్నట్టుండి బరువు తగ్గితే అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు.
ఇవేకాకుండా పిల్లల్లో కనిపించే మధుమేహం ఇతర సంకేతాలను కూడా పరిశీలించాలి. కొన్ని అంటువ్యాధులు, అలసట, చిరాకు, కోపం, నీరసం, విచారంతోపాటు కొన్ని మానసిక సమస్యలూ చిన్నారుల్లో కనిపించే అవకాశం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి ఈ లక్షణాలు కనుక పిల్లల్లో గమనిస్తే వెంటనే అలర్ట్ కావడం మంచిదంటున్నారు. అదేవిధంగా దగ్గరలోని వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
డయాబెటిస్ వస్తే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాలా? పెళ్లి చేసుకుంటే ఇబ్బందా?