Diabetes Patients Can Drink Alcohol : ఒక వయసు దాటిన తర్వాత మధుమేహం బారిన పడడం కామన్ అయిపోయింది. మరి.. షుగర్ ఉన్నవారు మద్యం తాగొచ్చా? అని అడిగితే.. ఎట్టిపరిస్థితుల్లో కూడా వారు మద్యం సేవించకూడదని నిపుణులంటున్నారు. చక్కెర వ్యాధికి మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లేనని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. కొద్దిగా మద్యం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని కొందరు అనుకుంటారని.. కానీ అది కేవలం అపోహ మాత్రమేనని అంటున్నారు.
షుగర్ ఉన్న వారిలో సాధారణంగా నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అటు మద్యం తాగితే కూడా నాడులు దెబ్బ తింటాయి. అలాంటిది.. షుగర్ ఉన్నవారు మద్యం తాగితే నాడుల ధ్వంసం మరింతగా పెచ్చు మీరుతుందని హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా మెజారిటీ జనాల్లో కాళ్లు చేతుల తిమ్మిర్లు, మంట పెట్టటం, సూదులతో పొడిచినట్టుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. మందు తాగడం వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువవుతుందని అంటున్నారు. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే నాడులు దెబ్బతిని కాళ్లు మొద్దుబారడం, పుండ్లు వంటి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి కూడా రావొచ్చని అంటున్నారు.
షుగర్ లెవెల్స్ పెరుగుతాయి :
మధుమేహం వ్యాధి ఉన్న వారు మందు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులంటున్నారు. 2018లో 'డయాబెటిస్ కేర్ జర్నల్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, మధుమేహం ఉన్న వారు మద్యం సేవించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు 30 శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. షుగర్ ఉన్నవారు మద్యం సేవించడం వల్ల షుగర్ లెవెల్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని డాక్టర్. ఎస్.మనోహర్ (జనరల్ ఫిజీషియన్) చెబుతున్నారు. మద్యం తాగితే ఇలా చేయండి :
షుగర్ ఉన్న వారు ఎప్పుడైనా మందు తాగాల్సి వాస్తే కొద్దిగా తీసుకుని తర్వాత భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు మాత్రలను వేసుకోవాలని అంటున్నారు. ఒకవేళ మందు తాగాక భోజనం చేయకపోతే మాత్రలను వేసుకోవద్దని పేర్కొన్నారు. ఆల్కాహాల్ తాగిన తర్వాత భోజనం చేయడం వల్ల కొంతవరకు చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయట. అయితే, మందు తాగిన తర్వాత భోజనం చేయకపోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయి హైపోగ్లైసీమియాలోకి వెళ్లిపోవచ్చు. ఇది ప్రమాదకరమని కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఆశ్చర్యం: ఫ్యాటీ లివర్‌ను కాఫీతో కరిగించొచ్చట! - ఈ పరిశోధన మీకు తెలుసా? - Coffee is good for NAFLD