Dental Problems During Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది తినే ఆహారం మొదలుకొని వేసుకునే మందుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. బిడ్డ పెరుగుదల, ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రతి నెలా డాక్టర్ల దగ్గర చెకప్ చేయించుకుంటారు. కానీ, ఈ సమయంలో ఎక్కువ మంది దంతాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అసలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎటువంటి దంత సమస్యలు వస్తాయి ? అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భం ధరించిన తరవాత మహిళల్లో హార్మోనల్ ఛేంజెస్ వస్తాయి. దీనివల్ల దంతాల చిగుళ్లు అత్యంత సున్నితంగా తయారవుతాయి. చిగుళ్లు బలహీనమవడంతో దంతాలు దెబ్బతింటాయి. కాబట్టి, గర్భిణు దంతాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని నిపుణులంటున్నారు. లేకపోతే కడుపులోని బిడ్డపైనా ఈ ప్రభావం పడుతుందట!
చిగుళ్ల వాపు..
గర్భిణుల్లో చాలా మందిలో చిగుళ్ల వాపు సమస్య కనిపిస్తుంది. చిగుళ్లు ఎర్రగా మారినట్లు కనిపిస్తాయి. బ్రష్ చేసినప్పుడు రక్తం కారుతుంది. అయితే, కొందరిలో ఈ సమస్య ఎక్కువగా ఉండవచ్చు. శరీరంలో హార్మోన్ స్థాయులు పెరగడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గర్భం ధరించిన రెండవ నెల నుంచి చిగుళ్లలో వాపు మొదలవుతుంది. ఇది ఎనిమిదవ నెల నుంచి తగ్గి బిడ్డ పుట్టిన తరవాత పూర్తిగా మాయమవుతుందని అంటున్నారు.
చిగుళ్లపై ఎర్రటి కణితి..
ప్రెగ్నెన్సీ సమయంలో చిగుళ్లపై ఎర్రటి కణితి వంటిది ఏర్పడుతుంది. దీన్ని 'గ్రాన్యులోమా లేదా ప్రెగ్నెన్సీ ట్యూమర్ ' అంటారు. కొంతమంది ఇది క్యాన్సర్ కణితి అని భయపడతుంటారు. కానీ, ఇది క్యాన్సర్‌కు సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు. నోటి శుభ్రత పాటించకపోతే ఇది ఏర్పడుతుందట.
పళ్లు వదులుగా..
గర్భం ధరించిన తరవాత శరీరంలో ఉత్పత్తయ్యే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల వల్ల దంతాలు వదులుగా మారతాయి. కాబట్టి, బ్రష్ చేయడానికి సున్నితమైన టూత్‌బ్రష్‌లను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నోరు పొడిబారటం..
ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మందికి నోరు ఎండిపోతుంటుంది. దీనివల్ల పెదవులు పగిలిపోవడం, తలనొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి, గర్భిణులు మంచి నీటిని ఎక్కువగా తాగాలి.
ఎక్కువ లాలాజలం ఉత్పత్తి..
గర్భిణులకు సాధారణంగా లాలాజలం ఎక్కువగా వస్తుంది. దీనివల్ల కొంత మందిలో వాంతులు అవుతుంటాయి. ఈ సమయంలో నోటి శుబభ్రత పాటించడం చాలా ముఖ్యమని అంటున్నారు.
ఇలా చేస్తే డెంటల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు..
- గర్భం ధరించిన తరవాత ఆరు నెలలకు ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించాలి.
- ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ను రోజుకు రెండుసార్లు వాడండి. అలాగే దంతాలను ఫ్లాస్ చేయండి.
- దంతాలను శుభ్రం చేసేటప్పుడు సాఫ్ట్ బ్రష్‌ను ఉపయోగించండి.
- వాంతుల కారణంగా పళ్లు తోముకోలేకపోతే యాంటాసిడ్లను వాడండి.
- లేదా ఒక కప్పు నీటిలో, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకుని నోటిని శుభ్రం చేసుకోండి.
- తాజా పండ్లు, కూరగాయలను తినండి.
- షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లు, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండండి.
- గర్భం ధరించిన తరవాత 3 నెలల నుంచి 6 నెలల మధ్య శిశువులో దంతాలు అభివృద్ధి చెందుతాయి.
- కాబట్టి ఈ సమయంలో కాల్షియం, ప్రొటీన్, ఫాస్పరస్, విటమిన్ ఎ, సి, డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అలర్ట్ - గర్భిణులు పానీపూరి తింటే ఏమవుతుంది?