Warning Signs Of Colon Cancer : క్యాన్సర్.. ఈరోజుల్లో ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న జబ్బులలో ఇదీ ఒకటి. ఇందులో పలు రకాలు ఉంటాయి. వాటిలో పెద్దపేగు క్యాన్సర్(Colon Cancer) ఒకటి. ఒకప్పుడు ఈ క్యాన్సర్ వృద్ధులలో ఎక్కువగా కనిపించేది. కానీ, ప్రస్తుతరోజుల్లో పలు కారణాల వల్ల వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. అంతేకాదు.. ఇటీవల కొన్ని అధ్యయనాలు యువకులలో పెద్దపేగు క్యాన్సర్ కేసుల పెరుగుదలను చూపించినట్లు కనుగొన్నాయి.
అయితే, ఈ క్యాన్సర్ తొలిదశలో చాలా మందికి ఎలాంటి లక్షణాలూ ఉండవు. క్యాన్సర్ ముదురుతున్నకొద్దీ కణితి సైజు, తలెత్తిన చోటును బట్టి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీంతో చాలా మంది దీనిని సరైన టైమ్లో గుర్తించలేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి, అలాకాకుండా ఉండాలంటే.. పెద్దపేగు క్యాన్సర్ ముందస్తు హెచ్చరిక సంకేతాలు, లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఆ సంకేతాలు ఇవే..
మలవిసర్జనలో మార్పులు : తరచూ మల విసర్జనలో మార్పులు గమనించినట్లయితే వెంటనే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని రోజుల కంటే ఎక్కువకాలం పాటు అతిసారం లేదా మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లయితే అది పెద్ద పేగు క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చంటున్నారు హైదరాబాద్లో అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ పి. విజయ్ ఆనంద్ రెడ్డి. అంతేకాదు.. 2005లో 'జర్నల్ ఆఫ్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. మలబద్ధకం ఉన్న వ్యక్తులకు పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
మలంలో రక్తం : పెద్ద పేగు క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణాలలో ఇది కూడా ఒకటని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా మలద్వారం నుంచి గానీ మలంలో గానీ రక్తం పడటం గమనించినట్లయితే వెంటనే అప్రమత్తం కావాలంటున్నారు. అంతేకాదు.. కొందరికి మలంలో రక్తం కలిసిపోయి విరేచనం నల్లగానూ అవ్వొచ్చంటున్నారు. కాబట్టి ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు.
అలర్ట్ : చీర అలా కట్టుకుంటే క్యాన్సర్ ఖాయం! - దేవుడా ఇంకా ఎన్ని చూడాలో!
పొత్తి కడుపు నొప్పి : పెద్దపేగు క్యాన్సర్‌కు సంబంధించి తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన లక్షణం.. పొత్తి కడుపు నొప్పి. నిరంతర కడపునొప్పి, తిమ్మిరి, ముఖ్యంగా మందులు తీసుకున్న తర్వాత కూడా కడుపులో తగ్గని అసౌకర్యాన్ని అనుభవిస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు.
వివరించలేని బరువు తగ్గడం : ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా బరువు తగ్గడం పెద్దపేగు క్యాన్సర్తో సహా అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మీ ఆహారం లేదా వ్యాయామ దినచర్యలో ఎలాంటి మార్పులు చేయకున్నా వెయిట్ లాస్ అయినట్లయితే వెంటనే అలర్ట్ అయ్యి వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
అలసట : మీరు తగినంత నిద్ర పోయాక కూడా అన్ని సమయాలలో అలసటగా అనిపిస్తుంటే మాత్రం అప్రమత్తం కావాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇది కూడా పెద్దపేగు క్యాన్సర్ లక్షణం కావొచ్చంటున్నారు. ముఖ్యంగా తీవ్రమైన అలసటను ఎదుర్కొంటుంటే మాత్రం వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు. అలాగే ఆకలి లేకపోవటం, తీవ్రమైన రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నా అలర్ట్ కావాలంటున్నారు. చివరగా.. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కారులో రోజూ ఒక గంటపైన జర్నీ చేస్తే - క్యాన్సర్ రావొచ్చట! - పరిశోధనలో నమ్మలేని నిజాలు!