Bleeding Gums Problem Causes : బ్రష్ చేస్తున్నప్పుడు చాలా మందికి చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. ఇలా చిగుళ్ల నుంచి బ్లడ్ ఎందుకు వస్తుందో చాలా మందికి తెలియదు. తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల చిగుళ్లు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చిగుళ్ల నుంచి రక్తం వస్తుందని అంటున్నారు. దీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు వస్తాయని.. తగిన జాగ్రత్తలతో తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
కొన్ని మందులతో :
కొంతమంది రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడుతుంటారు. దీనివల్ల చిగుళ్ల నుంచి తేలికగా రక్తం రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. కొన్నిరకాల మూర్ఛ మాత్రలు, రోగనిరోధక శక్తిని అణచిపెట్టే మందులు చిగుళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయట. దీనివల్ల బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం వస్తుందని నిపుణులంటున్నారు. అలాగే, కుంగుబాటు, అలర్జీ, రక్తపోటు తగ్గించే మందులు వాడేవారి నోరు పొడిబారుతుంది. వీటివల్ల కూడా చిగుళ్లు దెబ్బతింటాయని చెబుతున్నారు.
రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తే మేలు!
బ్రష్‌తో పళ్లు తోముకుంటున్నప్పుడు రక్తం వస్తే.. ఇది తొలి దశ చిగుళ్ల జబ్బుకు సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. నోట్లో నివసించే బ్యాక్టీరియా పళ్ల మీద పోగుపడి, గారగా మారుతుందట. ఒకవేళ మనం సరిగ్గా బ్రష్ చేయకపోతే చిగుళ్లు ఉబ్బి, ఎర్రగా అవుతాయని అంటున్నారు. దీనివల్ల రక్తస్రావమవుతుందని సూచిస్తున్నారు. అందుకే ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకునే ముందు బ్రష్‌తో పళ్లు తోముకోవటం చేయాలని సూచిస్తున్నారు. అలాగే పళ్ల మధ్య భాగాలను సన్నటి దారంతో శుభ్రం (ఫ్లాజింగ్) చేసుకోవాలని పేర్కొన్నారు.
దంతాల్లో రక్తమా? గుండెకు ముప్పు! - ఈ అలవాట్లు ఫాలో కావాల్సిందే!
స్మోకింగ్‌కు దూరంగా :
పొగతాగే అలవాటున్న వారికి చిగుళ్ల జబ్బు వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందట. పొగాకులోని కెమికల్స్ మన రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయి. దీంతో చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే పొగ తాగటం వల్ల దెబ్బతిన్న చిగుళ్లు త్వరగా కోలుకోవు! ఇది దీర్ఘకాలంలో చిగుళ్ల అనారోగ్యానికి కారణమవుందని నిపుణులు చెబుతున్నారు.
2018లో 'జర్నల్ ఆఫ్ పెరియోడాంటాలజీ' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. స్మోకింగ్ చేసే వారిలో చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో స్పెయిన్‌లోని యూనివర్సిటాడ్ కంప్లూటెన్స్ డి మాడ్రిడ్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెరియోడాంటాలజీలో ప్రొఫెసర్ 'డాక్టర్ మిగుయెల్ ఆంజెల్ స్లావిన్స్కీ' పాల్గొన్నారు.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో :
గర్భిణుల్లో హార్మోన్ల ప్రభావంతో చిగుళ్లకు ఎక్కువ రక్తం సరఫరా అవుతుంది. ఈ క్రమంలో చిగుళ్లు ఉబ్బి, ఎర్రబడతాయి. అలాగే గారకు కారణమయ్యే బ్యాక్టీరియా చిగుళ్ల మీద మరింత ఎక్కువగా దాడి చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, గర్భిణులు సరిగ్గా బ్రష్ చేసుకోవాలని, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
షుగర్ వ్యాధి :
చక్కెర వ్యాధితో బాధపడేవారిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. దీనివల్ల నోట్లో బ్యాక్టీరియాను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. వీరిలో చిగుళ్లు ఉబ్బుతాయి. ఫలితంగా బ్రష్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు రక్తం వస్తుంటుంది. కాబట్టి, షుగర్ ఉన్నవారు గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవాలి.
చివరిగా, బ్రష్ పోచలు కఠినంగా ఉంటే సున్నితమైన చిగుళ్లు దెబ్బతింటాయి. కాబట్టి, మెత్తటి పోచలున్న బ్రష్ వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి!
పళ్లు శుభ్రంగా లేకపోతే.. మతిమరుపు వస్తుందటా..!
బిగ్ అలర్ట్ : మీరు వాడే టూత్‌పేస్ట్ గుండె జబ్బులకు దారి తీస్తుందట! - ఎలాగో తెలుసా?