Best Foods for Weight Loss : ఈరోజుల్లో బరువు పెరగడం అనేది ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా మారిన జీవనశైలి కారణంగా అనేక మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మందికి వెయిట్ తగ్గించుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. అయితే బరువు తగ్గడమనేది ఇలా అనుకుంటే అలా పూర్తయ్యే పని కాదు. ఇందుకు కొన్ని నెలలు లేదా ఏళ్లు పట్టవచ్చు. దాంతో అప్పటిదాకా ఆగే ఓపిక లేని వాళ్లు క్రాష్ డైట్లు పాటిస్తూ, కఠినమైన వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని ఇబ్బంది పెడుతుంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తప్ప మరే ప్రయోజనం ఉండదు. అలాకాకుండా మీరు ఆరోగ్యకరంగా బరువు(Weight) తగ్గడానికి ఒక బ్రేక్‌ఫాస్ట్ డైట్ ప్లాన్ సూచిస్తున్నారు నిపుణులు. దీనిని వారం రోజులు ఫాలో అయితే రెండు కిలోల వరకు బరువు తగ్గొచ్చంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
మొదటి రోజు : ఈ బ్రేక్‌ఫాస్ట్ డైట్ ప్లాన్‌లో మొదటి రోజు తీసుకోవాల్సిన అల్పాహారం బచ్చలికూర/పాలకూర, టమాటాలతో కలిపి గిలకొట్టిన గుడ్లు. ఈ బ్రేక్‌ఫాస్ట్ ఫుడ్ మీకు ఉదయం పూట పూర్తిగా, సంతృప్తిగా ఉండేందుకు సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎగ్స్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వాటికి అదనంగా బచ్చలికూర, టమాటాలలో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు మీకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఆపుతాయి. అలాగే అతిగా తినే అవకాశాన్ని తగ్గిస్తాయి. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు.
రెండో రోజు : బరువు తగ్గడానికి మీరు రెండో రోజు పెరుగు, బెర్రీ పండ్లు, నట్స్‌తో అల్పాహారం ప్రిపేర్ చేసుకొని తినాలి. ముఖ్యంగా పెరుగులో ప్రొటీన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడడమే కాకుండా పేగులకు ఆరోగ్యకరంగా ఉంటుంది. అంతేకాకుండా బెర్రీలు, నట్స్‌లో ఉండే పోషకాలు మీకు తగిన శక్తిని అందిస్తాయి. కడుపు నిండిన భావనను కలిగిస్తాయంటున్నారు నిపుణులు.
మూడోరోజు : బరువు తగ్గడానికి మీరు మూడోరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లతో కూడిన ఓట్మీల్ తీసుకోవాలి. అరటిపండ్లు ముక్కలు, కొద్దిగా తేనె వేసి ఈ ఓట్మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఈ పోషకమైన బ్రేకఫాస్ట్ మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచడమే కాకుండా బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
ఈజీగా బరువు తగ్గాలా? ఉదయం పూట ఈ టిప్స్ పాటిస్తే అంతా సెట్!
నాలుగో రోజు : ఈ వెయిట్ లాస్ బ్రేక్‌ఫాస్ట్ డైట్లో మీరు నాలుగో రోజు తీసుకోవాల్సిన అల్పాహారం అవకాడో టోస్ట్. దీనిని టోస్ట్‌లు, అవకాడో, ఉడికించిన ఎగ్స్‌తో ప్రిపేర్ చేసుకోవాలి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా ఎగ్స్ కూడా ప్రొటీన్స్తో నిండి ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అంది త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది.
ఐదో రోజు : బరువు తగ్గడానికి ఐదో రోజు ప్రొటీన్లతో నిండిన స్మూతీలు తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడమే కాకుండా కేలరీలను బర్న్ చేస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం బచ్చలికూర, అరటిపండు, బాదం పాలు, ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్‌ని కలిపి స్మూతీలను తయారు చేసుకొని తాగాలి.
ఆరో రోజు : మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఈ బ్రేక్‌ఫాస్ట్ డైట్లో ఆరో రోజు కాటేజ్ చీజ్ తీసుకోవాలి. ఇది కూడా మంచి ప్రొటీన్ అల్పాహారం. మార్నింగ్ ఇది తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు.
ఏడో రోజు : ఇక ఈ వెయిట్ లాస్ బ్రేక్‌ఫాస్ట్ డైట్ ప్లాన్ ప్రకారం మీరు ఏడో రోజు తీసుకోవాల్సిన అల్పాహారం ఏంటంటే.. మిక్స్డ్ బెర్రీలతో కూడిన క్వినోవా. ఇది కూడా బరువు తగ్గడానికి మంచి అల్పాహార ఎంపిక. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి తగిన శక్తిని అందిస్తాయి.
పైన చెప్పిన బ్రేక్‌ఫాస్ట్‌ను ఫాలో అవ్వడమే కాకుండా రోజులో తగినంత వాటర్ తీసుకుంటూ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అంతేకాకుండా డైలీ వ్యాయామం కూడా తప్పకుండా ఉండేలా చూసుకోవాలంటున్నారు. అలాగే సూర్యరశ్మిలో కొంత సమయాన్ని గడపడానికి ట్రై చేయమంటున్నారు. ఎందుకంటే విటమిన్ డి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వీటితో పాటు ప్రధానంగా మధ్యాహ్నం, రాత్రిపూట భారీ ఆహారాలను తినకుండా చూసుకోవాలి. ఇలా వారం రోజులు చేస్తే రెండు కిలోల బరువు తగ్గడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? - ఈ కూరగాయలు తింటే ఈజీగా వెయిట్ లాస్!