Best Tips To Keep Alcohol Consumption Under Control : ఇప్పట్నుంచి 'మద్యం తాగను' అని కొందరు తీర్మానించుకుంటారు. ఒకట్రెండు రోజులు తాగకుండా ఉంటారు. మళ్లీ ఓదో ఒక వీక్ మూమెంట్ వస్తుంది.. కథ మళ్లీ మొదలవుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
లిమిట్ సెట్ చేసుకోవడం : మద్యానికి అలవాటైన వారు ఒకేసారి దాన్ని వదిలేయడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి.. లిమిట్ సెట్ చేసుకోవాలి. "ఇంత మాత్రమే తాగుతా" అని ఒక లిమిట్ పెట్టుకోవాలి. అది కూడా తక్కువమొత్తంలో సెట్ చేసుకోవాలి. కెనడియన్ సెంటర్ ఆన్ సబ్‌స్టాన్స్ అబ్యూజ్ అండ్ అడిక్షన్ - 2023 ప్రకారం.. వారానికి 30 ml కంటే ఎక్కువ తాగకూడదట. ఆల్కహాల్ ఎంత తీసుకున్నా.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నివేదిక పేర్కొంది. కాబట్టి.. వీలైతే మద్యం తీసుకోవడం అసలే మానుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్ మాణికం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు.
మధ్య మధ్యలో తినడం : ఇది కూడా అతిగా తాగడాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంటే.. మద్యం తాగుతున్నప్పుడు సిప్ల మధ్యలో తినడం అలవాటు చేసుకోండి. అది కూడా కాస్త ఎక్కువగానే తినాలి. అలాగే.. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ సేవించకుండా ఏదైనా తగినంత తినాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఖాళీ కడుపుతో తాగితే ఆల్కహాల్ వేగంగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుందంటున్నారు.
నెల రోజులు మద్యం తాగడం ఆపేస్తే - మీ బాడీలో ఏం జరుగుతుంది?
'నో' చెప్పడం నేర్చుకోండి : ఏదైనా పార్టీ లేదా ఇతర వేడుకలకు వెళ్లినప్పుడు ఆల్కహాల్ తీసుకునే సమయంలో ఇతరులు ఎక్కువ తాగమని ఒత్తిడి చేస్తుంటారు. అలాంటి టైమ్‌లో 'నో' చెప్పడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అలాంటి టైమ్‌లో మీకు మీరు మనసును అదుపులో ఉంచుకోవటాన్ని, తిరస్కరించటాన్ని అలవరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేయండి : మద్యం తాగడాన్ని తగ్గించుకోవాలి లేదా పూర్తిగా మానుకోవాలనుకుంటున్నప్పుడు మీ కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పండి. వారితో మనసు విప్పి మాట్లాడాలి. తన ప్రయత్నం సఫలమయ్యేలా ప్రోత్సహించాలని, అండగా ఉండాలని కోరాలి. ఇలా చెప్పడం ద్వారా వారు మిమ్మల్ని ఏదైనా వేడుకలలో కలిసినప్పుడు తాగమని బలవంతం చేయరని చెబుతున్నారు.
నెమ్మదిగా ఆల్కహాల్ తీసుకోవడం : మీరు అతిగా మద్యం తాగడాన్ని తగ్గించడంలో ఈ టిప్ కూడా ఉపయోగపడుతుందంటున్నారు. అదేంటంటే.. తాగేటప్పుడు నెమ్మదిగా మద్యం తీసుకోవాలి. ఎందుకంటే.. ఫాస్ట్ డ్రింకింగ్ ద్వారా ఎక్కువ ఆల్కహాల్ తాగేస్తారు. అలాగే.. హాలీడేస్ వచ్చినప్పుడు మద్యం తాగడానికి బదులుగా స్నేహితులతో కలిసి ఏదైనా విహారయాత్రకు ప్లాన్ చేయండి. ఇది కూడా మద్యపానం అతిగా సేవించడాన్ని తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
వెంటనే భోజనం చేయాలి : మీరు సెట్ చేసుకున్నంత మందు తాగేసిన తర్వాత.. ఆలస్యం చేయకుండా వెంటనే భోజనం చేసేయాలి. ఇలా తినడం అద్భుతంగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత మద్యం తీసుకోవాలనే కోరిక తగ్గిపోతుంది. కాబట్టి.. దీన్ని వెంటనే అమలు చేయాలి.
వ్యాయామం చేయాలి : రోజూ ఉదయాన్నే వ్యాయామం చేసేవారిలో ఒకవిధమైన ఉత్సాహం కనిపిస్తుంది. డల్‌గా, మనసు భారంగా ఉన్నవారికే మందు తాగాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం ద్వారా యాక్టివ్ అవుతారు కాబట్టి.. మందు మీద కోరిక కాస్త తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాగో.. మీరు లిమిట్ సెట్ చేసుకుని ఉంటారు కాబట్టి.. అది తీసుకొని వెంటనే భోజనం తినేయాలి. ఇలా చేయడం ద్వారా.. క్రమంగా మందును చాలా వరకు తగ్గించడం, చివరకు పూర్తిగా మానేయడం కూడా సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. మరి.. మీరూ ట్రై చేస్తారా?
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.