What is the Best Time to Drink Coffee: కాఫీ.. ఇది ఓ మూడ్ సెట్టర్. ఇది ఓ స్ట్రెస్ బస్టర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఒత్తిడికి చెక్ పెట్టి, ఉత్సాహాన్ని రెట్టించే ఓ టానిక్. ఒకప్పుడు కాఫీ అంటే ఉదయం, సాయంత్రం మాత్రమే తాగేవారు. కానీ నేటి జనరేషన్లో ఎప్పుడుపడితే అప్పుడు కాఫీ తాగేస్తున్నారు. ఎక్కువ మంది కాఫీతోనే తమ డే స్టార్ట్ చేస్తారు. అయితే చాలా మందికి అది ఏ టైంలో తీసుకోవటం బెస్ట్ అన్నది మాత్రం తెలియదు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఆ టైమ్ డేంజర్: మార్నింగ్ లేవగానే ఫస్ట్ కాఫీ తాగటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉదయం లేవగానే మన శరీరంలో కార్టిసాల్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయని.. ఈ సమయంలో కాఫీ తాగితే అది కార్టిసాల్ ప్రొడక్షన్ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. కార్టిసాల్తోనే మనం హుషారుగా ఉండి, ఎనర్జిటిక్‌గా ఉండగలం. ఒకవేళ మీరు ఉదయమే కాఫీతో డే స్టార్ట్ చేశారంటే కార్టిసాల్ తక్కువ ఉత్పత్తి అయి.. రోజంతా ఎక్కువ కాఫీ తాగాలనే ఫీలింగ్‌లో ఉంటారని.. లేదంటే హుషారు తగ్గి, బద్ధకంగా, నిద్ర తూగుతున్నట్టు ఉంటారని అంటున్నారు.
కాబట్టి.. శారీరక, మానసిక పనితీరు మెరుగ్గా ఉండాలంటే నిద్ర లేచిన తర్వాత కనీసం 90 నిమిషాల పాటు కాఫీ తాగకుండా ఉంటే మంచిదని అంటున్నారు. వీలైతే నిద్ర లేచిన రెండు గంటల పాటు కాఫీ తాగకపోతే మరీ మంచిదంటున్నారు. ఎందుకంటే నిద్ర లేచిన 2 గంటల తర్వాత కాఫీ తాగడం వల్ల అందులోని కెఫిన్ కారణంగా శారీరక, మానసిక చురుకునం సంతరించుకుంటుంది. అంతే కాకుండా మధ్యాహ్నం వరకు చురుకుగా ఉండేందుకు తోడ్పడుతుందని చెబుతున్నారు. అయితే.. మరికొంత మంది నిపుణులు వ్యాయామానికి ముందు కాఫీ తీసుకుంటే వర్కవుట్ మరింత బలంగా చేసే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు.
2013లో "జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీ"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఉదయం నిద్ర లేచిన 90 నిమిషాల తర్వాత కాఫీ తాగిన వారు మెరుగైన శారీరక పనితీరు, మానసిక పనితీరు, తక్కువ అలసట వంటివి అనుభవించారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటివ్ ఫిజియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ స్పెన్సర్ పాల్గొన్నారు.
మనిషి మనిషికr మారుతుంది: కొంత మందికి ఖాళీ కడుపుతో కాఫీ తాగితే అది జీర్ణం చేసుకునే శక్తి ఉండకపోవచ్చు. మరికొందరు కాఫీ లేకుండా పనే మొదలు పెట్టలేరు. ఇలా కాఫీ ఒకొక్కరిలో ఒక్కో విధంగా ప్రభావం చూపినప్పటికీ.. సగటున ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల మధ్య కాఫీ తాగేవారు మానసికంగా, శారీరకంగా చురుకుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.