Best Parenting Tips : తమ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అలాగే పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండాలని జాగ్రత్త పడుతుంటారు పేరెంట్స్. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల ఎదుగుదల విషయంలో సరైన శ్రద్ధ చూపలేకపోతున్నారు. దాంతో పిల్లలు శారీరకంగా బలహీనపడడమే కాకుండా, చిన్న వయసులోనే కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. కాబట్టి మీ పిల్లలు అలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే తల్లిదండ్రులుగా పిల్లలను బాల్యం నుంచే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచేలా చూడటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అందుకోసం ప్రతి పేరెంట్స్(Parents) కు పాటించాల్సిన కొన్ని టిప్స్ కూడా సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గేమ్స్‌లో పాల్గొనేలా ప్రోత్సహించడం : ఈరోజుల్లో చాలా మంది పిల్లలు ఫోన్స్‌లో ఇండోర్ గేమ్స్‌కి అలవాటు పడిపోయారు. కానీ, అది వారి ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. అందుకు బదులుగా పేరెంట్స్.. తమ పిల్లలు ఔట్ డోర్ గేమ్స్‌లో పాల్గొనేలా చూడడం చాలా ముఖ్యమంటున్నారు. సైక్లింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ వంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొనేలా వారిని ప్రోత్సహించాలంటున్నారు. వీటిలో పాల్గొనడం వల్ల పిల్లల కండరాలు దృఢంగా మారడమే కాకుండా వారి స్టామినా కూడా పెరుగుతుంది.
ఇంటి పనుల్లో పాల్గొనేలా చూడడం : మీ పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన మరో పని.. అప్పుడప్పుడు ఇంటి పనుల్లో పాల్గొనేలా చూడడం. ఇంట్లోని కొన్ని వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రాంతానికి మార్చడం, పాత్రలు శుభ్రం చేయడం, తోట పని చేయడం, ఇంటి క్లీనింగ్ పనులు వంటి వాటిలో పిల్లలు పాల్గొనేలా చూసుకోవాలి. దీంతో వారిలో క్రమశిక్షణ అలవడుతుంది. అలాగే కాస్త శారీ రక శ్రమ లభించడంతో వారు దృఢంగా తయారవుతారంటున్నారు నిపుణులు.
ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం : పిల్లల ఎదుగుదలలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వారు ఎదుగుతున్న దశలో సమృద్ధిగా ప్రోటీన్లు, మంచి కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు ఉన్న ఆహారాన్ని అందించడం చాలా అవసరమని తల్లిదండ్రులుగా మీరు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అలాగే వారు డైలీ తగినంత వాటర్ తీసుకునేలా, పండ్లు తినేలా చూడాలి. సమతుల్య ఆహారం పిల్లలు చురుకుగా ఉండటానికి, వారి శరీరాన్ని బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల శరీరానికి సరైన పోషకాహారం అందుతుంది. వారిని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుతుంది. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే జంక్‌ఫుడ్‌లకు దూరంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.
అలర్ట్ - మీ పిల్లలకు ఈ అలవాట్లు ఉన్నాయా?
సరైన నిద్ర ఉండేలా చూడడం : ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు రాత్రి వరకు టీవీ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం లేదా మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఆడడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ, ఇవి వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ తమ పిల్లలను వీలైనంత వరకు వాటిని పరిమితంగా యూజ్ చేసేలా చూసుకోవాలి. నిజానికి పిల్లలు ఆరోగ్యం బాగుండాలంటే మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం. మంచి నిద్ర పిల్లలు ఎదగడానికి మాత్రమే కాదు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడంలో చాలా బాగా సహాయ పడుతుందంటున్నారు మానసిక నిపుణులు.
రోల్ మోడల్‌గా నిలవండి : చివరగా తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన మరో పని.. పిల్లలకు రోల్ మోడల్‌గా నిలవడం. ఎందుకంటే పిల్లలు సాధారణంగా ప్రతి విషయంలో ఎక్కువగా పేరెంట్స్‌ను అనుకరిస్తారు. తల్లిదండ్రులుగా మీరు డైలీ వ్యాయామం చేయడం, సరిగ్గా తినడం, సమయానికి నిద్రపోవడం వంటివి చేస్తే మిమ్మల్ని మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మాత్రమే కాదు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండడంలో తోడ్పడతాయి. ఎలాగంటే మిమ్మల్ని చూసి వారు ప్రేరణ పొంది వాటిని ఫాలో అవుతారు.