Best Foods for Increasing Blood Circulation: ప్రస్తుత రోజుల్లో చాలా మంది బ్లడ్ సర్క్యులేషన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అధిక బరువు, ధూమపానం, మధుమేహం, రేనాడ్స్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వంటి అనారోగ్యాల కారణంగా రక్త ప్రసరణలో సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తప్రసరణ సరిగా లేకపోతే గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలలో సమస్యలు రావొచ్చు. అంతేకాకుండా రక్తప్రసరణ సరిగా లేనప్పుడు కండరాల తిమ్మిరి, నొప్పి, జీర్ణ సమస్యలు, చేతులు, కాళ్లలో తిమ్మిరి, చల్లబటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రసరణ సమస్యలు మందులతో చికిత్స చేసేందుకు వీలున్నప్పటికీ, కొన్ని ఆహారాలు తినడం వల్ల కూడా రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటంటే..
ఉప్పునీటి చేప: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. అంతేకాకుండా రక్తపోటును నియంత్రిస్తూ రక్త ప్రవాహాన్ని మెయింటెన్ చేస్తాయి. సాల్మన్, మాకేరెల్, ట్యూనా, ట్రౌట్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా-3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
సిట్రస్ పండ్లు: సిట్రస్ ఫ్రూట్స్‌లో లభించే సిట్రిక్ యాసిడ్ అదనపు కార్బోహైడ్రేట్లు లేకుండా అవసరమైన ఖనిజాలు, విటమిన్లను అందిస్తుంది. ఇవి రక్త నాళాల్లో ఏర్పడే గడ్డలను తొలగిస్తాయి. రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి. నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష సిట్రస్ ఫ్రూట్స్‌కి ఉదాహరణ.
నట్స్: మెగ్నీషియం, పొటాషియం, అర్జినైన్, కాల్షియం పుష్కలంగా లభించే వివిధ రకాల నట్స్.. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సాయపడతాయి. వీటిలోని అర్జినైన్.. నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది రక్త నాళాలను విశాలం చేస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వాల్‌నట్‌లు, హాజెల్‌నట్‌లు, జీడిపప్పులు, బాదంపప్పులలో అర్జినైన్ సమృద్ధిగా ఉంటుంది.
గంటల కొద్దీ కదలకుండా కూర్చుంటే ఆరోగ్యానికి చేటే!
వెల్లుల్లి: రక్తపోటు, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో వెల్లుల్లి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోని సల్ఫర్ కంటెంట్ రక్తపోటును తగ్గిస్తుంది. రక్త నాళాలను రిలాక్స్ చేస్తుంది. అలాగే రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
ఉల్లిపాయలు: ఉల్లిపాయలు కూడా రక్తపోటును నివారించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సాయపడతాయి. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. 2020లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 4 వారాల పాటు రోజుకు రెండు ఉల్లిపాయలు తిన్న పెద్దల్లో రక్తప్రసరణ మెరుగుపడిందని స్పష్టమైంది. అలాగే 2016లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో, ఉల్లిపాయలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
సరైన ఆహారాన్ని తీసుకోవడమే కాకుండా జీవనశైలిలో మార్పులు కూడా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతాయి. ధూమపానం మానేయడం, ఒత్తిడికి దూరంగా ఉండటం, ఫ్రై ఫుడ్స్‌ను పూర్తిగా మానేయడం, నీళ్లు ఎక్కువగా తాగడం, పీచుపదార్థాలు ఎక్కువగా తినడం, మితమైన వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.