Benefits Of Washing Feet Before Bed : రోజంతా మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లేవి, ప్రతి అడుగులోనూ మీతోనే ఉండేవి మీ పాదాలు. వాస్తవానికి శరీరంలోని ఇతర భాగాలకంటే పాదాలపైనే ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది ముఖం, చేతులు వంటి శరీర భాగాలపై చూపించే జాగ్రత్త, మక్కువ పాదాల ఆరోగ్యం విషయంలో చూపించరు. చలికి, వేడికి వాటిని అలా వదిలేస్తారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పాదాలను అపరిశుభ్రంగా, అజాగ్రత్తగా వదిలేస్తే చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట.
పాదాలను ఎందుకు కడుక్కోవాలి?
దిల్లీలోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ సెంటర్‌లోని పాడియాట్రిస్ట్ డాక్టర్ గోవింద్ సింగ్ బిష్ట్ చెబుతున్న దాని ప్రకారం, రాత్రి పడుకునే ముందు పాదాలను కడుక్కోకపోతే మీ మంచం సూక్ష్మక్రీములకు కేంద్రంగా మారుతుందట. రాత్రి నిద్రపోయే ముందు ముఖం, చేతులను ఎలా అయితే శుభ్రంగా కడుక్కుంటారో పాదాలను కూడా అలాగే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో, బయట మీరు ఎదుర్కోనే మురికి, క్రీములు, సూక్ష్మ ధూళి కణాలు సులభంగా పాదాలలోకి ప్రవేశిస్తాయి. పగటిపూట మీరు పాదరక్షణ ధరించే ఉంటారు కనుక పాదాలకు చెమట పడుతుంది. ఇది బ్యాక్టీరియాను పేరుకుపోయేలా చేస్తుంది. పడుకునే మందు మీరు పాదాలను శుభ్రంగా కడుక్కోకపోతే ఇవన్నీ మిమ్మల్ని రకరకాలుగా ప్రభావితం చేస్తాయి.
ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది?
అపరిశుభ్రంగా ఉన్న పాదాలతో పడుకోవడం వల్ల బ్యాక్టీరియాతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. పాదాలపై చర్మ సమస్యలకు కారణమవుతుంది. చర్మంపై దురద, ఎర్రబడటం, పొట్టు ఊడిపోవడం, చిగుళ్లు పగలడం, పొక్కలు, మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా అథ్లెట్స్, స్టూడెంట్స్ ఎక్కువ సేపు షూస్ ధరించే వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఒకరి నుంచి మరొకరు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. పాదాల పగుళ్లు సాధారణమే అయినప్పటికీ వీటిని నిర్లక్ష్యం చేస్తే విపరీతమైన నొప్పి కలుగుతుంది. కొన్ని సార్లు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది.
ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
పాదాలు ఎప్పుడూ మృదువుగా, ఆరోగ్యంగా ఉండాలంటే బయట నుంచి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. తప్సనిసరిగా రోజుకు కనీసం రెండు సార్లైన పాదాలపై శ్రద్ద పెట్టి శుభ్రం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. వారానికి కనీసం రెండు సార్లు అయినా గోరు వెచ్చటి నీటితో పాదాలను నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల కీళ్లు, కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. మృదువుగా, అందంగా మారతాయి. పైగా హాయిగా నిద్రపోవచ్చు కూడా. డయాబెటిక్ పేషెంట్లు పాదాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.