Benefits of Breastfeeding to Mother and Baby: తల్లి స్తన్యం నుంచి వచ్చే పాలు బిడ్డకు అమృతంతో సమానం. ఆ పాలలో కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఎంజైమ్స్, విటమిన్స్, ఖనిజాలు, యాంటీబాడీలు, హార్మోన్లు, బయాయాక్టివ్ కాంపోనెంట్లు, పెప్‌టైడ్‌లు, ఇమ్యునోమోడ్యులేటర్లు ఇలా ఎన్నో ఉంటాయి. అయితే.. కొంతమంది తల్లులు పలు రకాల కారణాలతో పిల్లలకు పాలివ్వడం మానేస్తుంటారు. కొందరు మొదటి నుంచే పాలివ్వడం ఆపేస్తే.. మరికొందరు కొన్ని రోజులే పాలు ఇచ్చి, ఆ తర్వాత డబ్బా పాలు అలవాటు చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
రోగనిరోధక వ్యవస్థ బలోపేతం: తల్లిపాలలో యాంటీబాడీలు, పెప్ టైడ్లు, ఇమ్యునోమోడ్యులేటర్లు ఉంటాయి. ఇవి శిశువు రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. తల్లిపాలు తాగే పిల్లలు చెవి ఇన్ఫెక్షన్లు, అతిసారం, న్యుమోనియా వంటి సాధారణ శిశువ్యాధులకు గురయ్యే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది : తల్లిపాలు తాగే పిల్లలకు లుకేమియా, లింఫోమా, బ్రెయిన్ ట్యూమర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తక్కువని నిపుణులు అంటున్నారు. అలాగే టైప్ 1, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువంటున్నారు.
తల్లికీ ఎంతో మేలు : తల్లి పాలు తాగడం వల్ల పాపాయికే కాదు.. పాలిచ్చే తల్లికీ ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు అంటున్నారు. బిడ్డ రొమ్ము పట్టినప్పుడు తల్లి మెదడు నుంచి సంకేతాలు వెలువడి.. ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది పాలు పడడానికే కాకుండా గర్భాశయం త్వరగా సంకోచించడానికీ దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో కాన్పు తర్వాత రక్తస్రావమూ తగ్గుతుంది. మాతృ మరణాల్లో చాలావరకు రక్తస్రావం ఆగకపోవడమే ప్రధాన కారణమట.
రొమ్ము క్యాన్సర్ : బిడ్డకు పాలివ్వడం ద్వారా మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 1992లో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పాలు ఇచ్చే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 26% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో న్యూట్రిషన్ ప్రొఫెసర్ డాక్టర్ ఫ్రాంక్ బి.హు పాల్గొన్నారు. పిల్లలకు తల్లి పాలు ఇచ్చే వ్యవధి పెరిగేకొద్దీ ఈ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని ఆయన తెలిపారు.
2002లో జర్నల్ ఆఫ్ నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 24 నెలలకు పైగా పిల్లలకు పాలు ఇచ్చే మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉందని కనుగొన్నారు.
బరువు తగ్గొచ్చు: బిడ్డకు పాలివ్వడం వల్ల ప్రెగ్నెన్సీలో పెరిగిన బరువును సైతం సులభంగా తగ్గచ్చని నిపుణులు అంటున్నారు. పాపాయికి పాలు పట్టే క్రమంలో తల్లి శరీరంలోని క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయని.. తద్వారా తల్లులు ఈజీగా బరువు తగ్గేయచ్చంటున్నారు. అలాగే పాలు పట్టడం వల్ల తల్లి మధుమేహం, అధిక రక్తపోటు బారిన పడే అవకాశం చాలావరకు తగ్గుతుందని.. కాన్పు తర్వాత ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు.. వంటివి బిడ్డకు పాలివ్వడం వల్ల తగ్గుముఖం పడతాయంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : సాయంత్రం పూట టీ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అస్సలు తాగకూడదట! - Tea Side Effects