Baby Massage Benefits : పసిపిల్లలకు చక్కగా మసాజ్ చేసి స్నానం చేయించడం భారతీయ సంప్రదాయంలో భాగం. మర్దన అనేది శిశువు ఆరోగ్యకరమైన అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని భారతీయులు నమ్ముతారు. ఇది బిడ్డ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, అవయవాలను బలోపేతం చేస్తుంది. అంతేకాదు మసాజ్ అనేది తల్లిదండ్రులు పిల్లలకు మరింత దగ్గరయ్యేందుకు ఉపయోగపడుతుందని, ముఖ్యంగా తల్లీబిడ్డల బంధాన్ని మానసికంగా, శారీరకంగా బలోపేతం చేస్తుందని పెద్దలు, నిపుణులు చెబుతుంటారు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కనుక ప్రతి ఇంట్లో పెద్దవాళ్లు ఉండేవారు. ఇలాంటి విషయాలు వాళ్లే చూసుకునే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల కారణంగా చాలా మందికి మసాజ్ చేసే సమయం, పద్ధతుల గురించి పెద్దగా అవగాహన లేక సతమతమవుతున్నారు. అలాంటి తల్లిదండ్రులు శిశువుకు మసాజ్ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం.
శిశువు మర్దనకు ఎలాంటి నూనె మంచిది?
ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) ప్రకారం, ఆయిల్ మసాజ్ శిశువుకు బహుళ ప్రయోజనాలను కలిగిస్తుంది. అయినప్పటికీ తల్లిదండ్రులు ఆలివ్ లేదా ఆవాల నూనెను మర్దనకు ఉపయోగించకపోవడమే మంచిదట. అవి మందంగా, జిడ్డు తక్కువగా ఉండి శిశువు చర్మ అవరోధానికి హాని కలిగించవచ్చు. తేలికైన, అంటుకునే నూనెలు, విటమిన్- ఇ కలిగి ఉండే నూనెలు శిశువుల కోసం రూపొందించిన నూనెలను మాత్రమే మర్దన కోసం ఉపయోగించాలి.
మసాజ్ చేయడానికి సరైన సమయం ఏంటి?
మసాజ్ చేసేముందు బిడ్డ ప్రశాతంగా, సౌకర్యవంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఆహారం తినిపించిన తర్వాత కనీసం రెండు గంటల తర్వాత మర్దనా చేయడం వల్ల శిశువు ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. వేసవి కాలంలో అయితే స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేయాలి. శీతాకాలంలో మాత్రం స్నానం చేయించిన తర్వాత బిడ్డ ఒంటికి నూనెతో మర్దనా చేయాలి. మసాజ్ చేస్తున్నప్పుడు శిశువు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటేనే మసాజ్ చేయాలి. చికాకు పడి ఏడిస్తే మర్దన చేయకపోవడమే మంచిది.
ఎలా మసాజ్ చేస్తే మంచిది?
మర్దన అనేది ఎప్పుడూ సున్నితంగా, నిదానంగా చేయాల్సిన పని. అదే సమయంలో శిశువును సురక్షితంగా, దృఢంగా మార్చేలా ఉండాలి. కాబట్టి పిల్లలకు మసాజ్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించకుండా ఉండాలి. సున్నితమైన తక్కువ బలాన్ని ఉపయోగిస్తూ మర్దన చేయాలి. ముఖ్యంగా తల విషయంలో చాలా శ్రద్ధగా మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో సలహా ఏంటంటే మర్దన అనేది ఎప్పుడూ కాళ్లతో మొదలు పెట్టి తల వరకూ చేయాలి.
ఎన్ని నెలల శిశువుకు మసాజ్ చేయచ్చు?
డాక్టర్ సలహా మేరకు పుట్టిన కొద్ది రోజులకే పిల్లలకు మసాజ్ చేయడం ప్రారంభించవచ్చు. కానీ వీళ్ల విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరు నెలలు దాటాక బిడ్డకు కాస్త ఒత్తిడి ఉపయోగించి మర్దన చేయచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
'వాటర్ వెయిట్' సమస్య ఉంటే ఏమవుతుంది? దీన్ని తగ్గించడం ఎలా? - water retention in body symptoms