Ayurveda Tips to Relief from Stress: ప్రతిరోజూ ఇంట్లో, ఆఫీసులో ఎన్నో పనులు. ఎన్నో సమస్యలు. మరెన్నో ఆటుపోట్లు. వీటన్నింటినీ ఎదుర్కొనే క్రమంలో కొంత మానసిక ఒత్తిడికి గురవుతాం. అయితే ఒత్తిడి శ్రుతిమించితే రకరకాల దుష్ప్రభావాలు పొంచి ఉంటాయి. కారణం.. మానసిక ఒత్తిడి నెమ్మదిగా శరీరంపై ప్రభావం చూపుతుంది. వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆయుర్వేదంలో అనేక మార్గాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో కొన్ని మూలికలను చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
తులసి ఆకులు, పెరుగు: తులసి ఆకుల్లోని పోషకాలు పలు ప్రయోజనాలు అందిస్తాయని తెలిసిందే. ఈ క్రమంలోనే ఒత్తిడిని తగ్గించడంలో కూడా తులసి ఆకులు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చంటున్నారు. ఈ రెండిటి కలయిక మెదడును ప్రశాంతపరిచే హార్మోన్ల చర్యను వేగవంతం చేస్తుందని.. ఇది అధిక ఆందోళన, అనవసరమైన ఆలోచనలను అరికట్టడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
మెంతులు: వివిధ వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి మెంతులు ఉత్తమ ఔషధం. అయితే ఒత్తిడి, డిప్రెషన్‌కు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెంతి గింజలను ఆహారంలో ఎక్కువగా చేర్చడం, మెంతులు కలిపిన నీటిని తాగడం ద్వారా ప్రయోజనాలు అందుతాయంటున్నారు.
చమోమిలే టీ: అనేక ఔషధ గుణాలున్న వాటిలో చామంతి మొక్క ఒకటి. అయితే దీని ఆకులతో తయారు చేసిన చమోమిలే టీని తాగడం వల్ల డిప్రెషన్, మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది సరైన నిద్ర పొందడానికి, మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుందని అంటున్నారు.
నిమ్మకాయ నీరు: ఒత్తిడికి, డిప్రెషన్‌కు నిమ్మరసం మంచి మందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది నాడీ వ్యవస్థ పనితీరును సజావుగా ఉంచుతుందని.. మన శరీరానికి మంచి శక్తిని అందిస్తుందని అంటున్నారు.
అశ్వగంధ: ఆయుర్వేదం ప్రకారం.. ఒత్తిడి, డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగించడంలో అశ్వగంధ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2012లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం అశ్వగంధ.. కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఔషధశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ కల్లూరి పాల్గొన్నారు.
టెన్షన్‌తో భేజా ఫ్రై అవుతోందా? - ఇది నోట్లో వేసుకోండి - క్షణాల్లో హుష్ కాకి!
బాదంపప్పు: బాదంపప్పులోని పోషకాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ పప్పులు ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయని అంటున్నారు. అందుకోసం ఐదు లేదా ఆరు బాదంపప్పులను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటి పై తొక్క తీసి మెత్తగా చేసి పాలలో కలపి తీసుకుంటే.. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.
యాలకులు: మానసిక ఒత్తిడి దూరం చేయడంలో యాలకులు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు సమయంతో పని లేకుండా యాలకులు తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే స్ట్రెస్ పెరగడం ఖాయం!