Avoid These Unhealthy Cooking Methods: మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. అయితే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడమే కాదు.. వాటిని ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వండుకోవడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. అప్పుడే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయంటున్నారు. కానీ చాలా మంది పదార్థాలకు అదనపు రుచిని అందించాలని రకరకాలుగా వండుతుంటారు. అయితే అలాంటి పద్ధతుల వల్ల పదార్థాలు విషపూరితమై.. వివిధ రకాల అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి అలాంటి వంట పద్ధతుల్ని పాటించకపోవడమే మంచిదంటున్నారు. ఇంతకీ ఆహారాన్ని విషపూరితం చేసే ఆ కుకింగ్ పద్ధతులేంటో ఈ స్టోరీలో చూద్దాం..
ఫ్రై - చాలా మందికి భోజనంలో ఏదో ఒక వేపుడు లేనిదే ముద్ద దిగదు. అయితే ఆయా కాయగూరల్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఫ్రై చేసే క్రమంలో అక్రిలమైడ్ అనే రసాయనం వెలువడుతుందని.. ఇది భవిష్యత్తులో క్యాన్సర్ కారకంగా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డీప్ ఫ్రై - నూనెలో వేయించిన పదార్థాలంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పదార్థాలను వేయించే క్రమంలో నూనె ఆక్సిడైజ్ చెంది.. ట్రాన్స్‌ఫ్యాట్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి చెడు కొవ్వులు. ఇలాంటి డీప్ ఫ్రైడ్ పదార్థాల్ని రోజూ తీసుకోవడం వల్ల.. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండె సంబంధిత సమస్యలొస్తాయంటున్నారు.
గ్రిల్లింగ్ - పదార్థాల్ని గ్రిల్ చేసుకొని తినడం ఆరోగ్యకరం అని చెబుతుంటారు నిపుణులు. అయితే అది కాయగూరలు, పండ్లు వంటి కొన్ని పదార్థాలకు మాత్రమే వర్తిస్తుందంటున్నారు. అదే మాంసాహారాన్ని ఈ పద్ధతిలో ఉడికిస్తే.. హెటరో సైక్లిక్ అమైన్స్ అనే రసాయనాలు వెలువడతాయని చెబుతున్నారు. సహజంగానే కార్సినోజెనిక్ స్వభావాన్ని కలిగి ఉండే ఈ రసాయనాలు.. భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును పెంచుతాయంటున్నారు నిపుణులు.
2018లో "క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం గ్రిల్లింగ్ పద్ధతిలో తయారు చేసిన మాంసం తినడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో మిన్నేసోటా విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ హెల్త్ స్కూల్ ప్రొఫెసర్, ఎపిడెమియాలజిస్ట్ డా. రాబర్ట్ బెర్నార్డ్ పాల్గొన్నారు.
స్మోకింగ్ - మంట, పొగపై కొన్ని పదార్థాల్ని ఉడికిస్తుంటారు. ఈ క్రమంలో పొగ ఆయా పదార్థాలకు అదనపు రుచిని అందిస్తుందనుకుంటారు. కానీ, ఈ క్రమంలోనే కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు వెలువడతాయని, వీటి వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందంటున్నారు.
మైక్రోవేవింగ్ - అవెన్‌లో కొన్ని పదార్థాల్ని వండుకోవడం, తిరిగి వేడి చేసుకోవడం చాలామందికి అలవాటే. అయితే ఈ పద్ధతిలో విడుదలయ్యే రేడియేషన్ కారణంగా బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)చెబుతోంది.
ఎయిర్ ఫ్రైయింగ్ - నూనె లేకుండా లేదా తక్కువ నూనెతో పదార్థాల్ని వేయించుకోవడానికి ప్రస్తుతం చాలా మంది ‘ఎయిర్ ఫ్రైయింగ్’ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇందుకోసం పలు గ్యాడ్జెట్స్ సైతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పద్ధతిలో ఉత్పత్తయ్యే వేడి గాలి.. ఆరోగ్యానికి నష్టం కలిగించే పలు రకాల రసాయనాల్ని రిలీజ్ చేయడంతో పాటు.. పదార్థాలు సరిగ్గా ఉడక్కపోవచ్చంటున్నారు. మిగతా పద్ధతులతో పోల్చితే ఇది కాస్త ఆరోగ్యకరమైనదే అయినా.. తరచూ దీనిని పాటించకపోవడమే మంచిదంటున్నారు.
నాన్‌స్టిక్ - ప్రస్తుతం చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో ఉండే టెఫ్లాన్ కోటింగ్ అధిక ఉష్ణోగ్రత వల్ల కరిగి వివిధ రకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చి పెట్టే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.