Alcohol Health Risks in Women : మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. అయినా అవేమీ పట్టించుకోకుండా మగాళ్లతోపాటు ఆడవాళ్లు కూడా మందు తాగేస్తున్నారు. అయితే.. ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనం మాత్రం మహిళలు మందు తాగొద్దని చెబుతోంది. మద్యం(Alcohol) తాగితే పురుషులకన్నా మహిళల ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదమని వెల్లడైంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
"Journal of the American College of Cardiology"అనే పేరుతో ఈ రీసెర్చ్ రిపోర్టు ప్రచురితమైంది. దీని ప్రకారం.. ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ రకాల మద్యం సేవించే మహిళలకు గుండె జబ్బుల ముప్పు గణనీయంగా ఉంటుందని తేలింది. ఈ అధ్యయనంలో 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల 4 లక్షలకు పైగా మందిని పరిశీలించారట!
అదేవిధంగా.. మితంగా మద్యం తాగే మహిళలతో పోలిస్తే, ఎక్కువ మద్యం తాగే మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 33 నుంచి 51 శాతం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ఇందులో మరో షాకింగ్ విషయం కూడా ఉంది. చాలా మంది అప్పుడప్పుడు మద్యం తాగుతున్నాం.. తమకు ఏమీ కాదని భావిస్తుంటారు. కానీ.. అప్పుడప్పుడూ తాగినా.. అతిగా తాగితే మాత్రం వారిలో ఈ ప్రమాదం 68 శాతం వరకు ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. అప్పుడప్పుడూ ఎక్కువగా ఆల్కహాల్ తాగే పురుషుల్లో కూడా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 33 శాతం ఎక్కువగా కనిపించిందని ఆ అధ్యయనం పేర్కొంది. కాబట్టి.. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్‌ను సమతుల్యంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు.
నెల రోజులు మద్యం తాగడం ఆపేస్తే - మీ బాడీలో ఏం జరుగుతుంది?
ఈ పరిశోధనలో.. 'బ్రిగామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌లో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జమాల్ ఎస్. రాణా' పాల్గొన్నారు. ఆయన ఏమంటున్నారంటే.. "కొందరు మద్యపానం గుండెకు మేలు చేస్తుందని నమ్ముతారు, కానీ.. ఇప్పుడు చాలా అధ్యయనాలు ఆ నమ్మకాన్ని సవాలు చేస్తున్నాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే.. గుండె సంబంధిత సమస్యలతోపాటు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి." అని డాక్టర్ జమాల్ చెప్పారు.
ఎక్కువగా మద్యం తాగితే ఏం జరుగుతుంది?
ఏదైనా పరిమితికి మించి తీసుకున్నప్పుడు హానికరమని.. ఆల్కహాల్ విషయంలో కూడా అది చాలా స్పష్టంగా తెలుస్తోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ మద్యం తాగడం రక్తపోటు సమస్యకు దారితీస్తుంది. అది క్రమంగా మీ గుండె పనితీరుపై ప్రభావం చూపడమే కాకుండా.. కండరాలనూ బలహీనపరుస్తుందని చెబుతున్నారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.