First Aid for Emergency Cases : ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లెలోపు రోగికి చేసే చికిత్సనే ప్రథమ చికిత్స అంటారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను వైద్య పరిభాషలో 'Golden Hour' అంటారు. రోగికి మొదటి గంటలో సరైన చికిత్సను అందించడం ద్వారా అతడిని ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించవచ్చని వైద్యలు చెబుతున్నారు. అందులో భాగంగా 10 రకాల ప్రథమ చికిత్సలను గురించి ఇప్పడు తెలుసుకుందాం.
- బెణికిన గాయాలు : బెణికిన గాయం (Sprain Injuries)పై ఆయింట్‌మెంట్‌తో గట్టిగా రుద్దకూడదని వైద్యలు సూచిస్తున్నారు. మొదట దళసరి వస్త్రం, పాలిథీన్ కవర్‌లో ఐస్ ఉంచి కాపడం పెట్టాలంటున్నారు. అనంతరం ఆ వ్యక్తికి క్రేప్ బ్యాండేజ్‌తో కట్టుకట్టాలని, గాయం అయిన ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టి విశ్రాంతి తీసుకునేలా చూడాలంటున్నారు వైద్యులు. అనంతరం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
- కాలిన గాయాలు : ఎదైనా ప్రమాదం జరిగినప్పుడు శరీరం కాలిపోతే ముందుగా కాలిన ప్రాంతాన్ని చల్లని నీటిలో 15-20 నిమిషాలు ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అరచేయి మందంలోపు గాయం అయితేనే గాయంపై ఆయింట్‌మెంట్ రాయాలని చెబుతున్నారు.కాలిన బొబ్బలను చిదమకూడదు. బ్యాండేజ్‌తో కట్టు కట్టకూడదు. ఐస్ కూడా పెట్టకూడదని, మంటలు అంటుకున్నప్పుడు పరిగెత్తకూడదు. ఎస్డీఆర్ (SDR) నియమం పాటించాలి. ఆగడం, కింద పడిపోవడం, అటూ ఇటూ దొర్లడం లాటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
- పాయిజన్ (విషం) తీసుకోవడం: పాయిజన్ తీసుకున్న వ్యక్తికి విషతీవ్రతను (Poison) తగ్గించడానికి ఎక్కువ నీటిని ఇస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యలు సూచిస్తున్నారు. అలాంటివారిని ఆస్పత్రికి వెళ్లేవరకూ స్పృహ తప్పిపోకుండా చూసుకోవాలని వైద్యలు సలహా ఇస్తున్నారు. పక్కకు పడుకోబెట్టి గడ్డాన్ని ఎత్తిపెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లాలంటున్నారు. వెళ్లకిలా పడుకోబెట్టకూడదు, దానివల్ల నాలుక గొంతుకు అడ్డుపడి శ్వాస ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యలు.
- ఎముకలు విరగడం: ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగితే (Bones Break), రోగి ఆందోళన చేందకుండా చూసుకోవాలని, ఆ తరువాత ఎముక విరిగిన ప్రాంతాన్ని కదలనివ్వకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెబుతున్నారు.
- పక్షవాతం : బీపీ (రక్తపోటు) ఎక్కువగా ఉన్నవారు ఒళ్లు తిరుగుతుందనీ, తిమ్మిరిగా ఉందని చెబితే ఆ వ్యక్తిని నవ్వమని అడగండి. అలా అతడు నవ్వేటప్పుడు మూతి వంకరగా ఉన్నా, సరిగ్గా మాట్లాడలేకపోయినా, చేతులు ఎత్తలేకపోయినా పక్షవాత (Paralysis) చిహ్నంగా భావించాలని వైద్యులు చెబుతున్నారు. వెంటనే (గోల్డెన్ అవర్)లోపు ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యలు సూచిస్తున్నారు.
- కుక్కకాటు : కుక్కకాడు (Dog Bite), పిల్లి, కోతి, ఎలుక కరిచిన వెంటనే ఆ ప్రాంతాన్ని సబ్బునీటితో కడగాలని వైద్యలు సూచిస్తున్నారు. బ్యాండేజ్ కట్టుకట్టడం, కుట్లు వేయడం లాంటివి చేయకూడదని చెబుతున్నారు. వెంటనే మీకు దగ్గర్లో ఉన్న వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
- కరెంట్ షాక్ : ఏ వ్యక్తికైనా కరెంట్ షాక్ (Electric shock) కొట్టినట్లు అనిపిస్తే వెంటనే స్విచ్‌లు ఆపాలి, ప్లగ్‌లు తొలగించాలి. షాక్ తగిలిన వ్యక్తి గడ్డాన్ని పైకెత్తి ఉంచాలి. శ్వాస తీసుకోలేకపోతే కృత్రిమ శ్వాస కల్పించాలి. షాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ జరిగితే గుండె తిరిగి కొట్టుకునేలా ప్రయత్నాలు చేయాలని ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యలు సూచిస్తున్నారు.
- గుండెపోటు : ఛాతీ ప్రాంతంలో తీవ్రంగా పొడిచినట్లుగా అనిపించడంతో పాటుగా నొప్పి పెరిగిపోవడం, శరీరంలో ఇంకెక్కడైనా నొప్పిగాఉంటే గుండెపోటు (Heart Attack) లక్షణాలుగా వైద్యలు చెబుతున్నారు. ఆగకుండా చెమటలు, కడుపులో వికారంతో కూడిన ఛాతీ నొప్పిని గుండెపోటు లక్షణాలని చెబుతున్నారు. అలాంటి సమయంలో ఆ వ్యక్తిని పడుకోబెట్టకూడదు, నిల్చోబెట్టకూడదు, నడిపించవద్దు కూర్చోబెట్టి దగ్గమని చెబుతూ దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించాలని వైద్యలు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కాస్త ఫలితం కనిపిస్తుందని అంటున్నారు.
- కళ్లు తిరిగి పడిపోవడం : కళ్లుతిరిగి పడిపోవడం అనేది అనేక అనారోగ్య కారణాల వల్ల వస్తుంది. కళ్లు తిరిగి పడిపోయిన వ్యక్తి కాళ్లను ఎత్తుగా పెట్టి తలను పక్కకు పెట్టి ఉంచాలని వైద్యలు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెదడుకు రక్తస్రావం జరిగి తిరిగి త్వరగా కోలుకుంటారని వైద్యలు సూచిస్తున్నారు.
- పాముకాటు : పాముకాటుకు గురైన వ్యక్తి మరణించడానికి 90% కారణం భయమే కారణం అంటున్నారు నిపుణులు. అందుకనే పాముకాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అయితే, పాముకాటు (Snake Bite), తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం, రక్తంపీల్చడం లాంటివి చేయరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు ఉన్నాయి.
ప్రథమ చికిత్స చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి : ఎవ్వరికైనా ప్రథమ చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైతే గ్లోవ్స్ ధరించాలంటున్నారు. డెట్టాల్ లాంటి యాంటీసెప్టిక్ లోషన్‌ను నేరుగా వాడకూడదని సూచిస్తున్నారు. కొన్ని చుక్కలు నీళ్లలో కలిపి, దూదితో గాయాలను శుభ్రం చేయాలని పేర్కొంటున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.