Rajinikanth Vettaiyan Movie Court Case : సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ వేట్టాయన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 10న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ అయింది. అయితే తాజాగా ఈ చిత్రంపై మధురై హై కోర్టులో పిల్ దాఖలు అయింది.
ఎందుకంటే? - రీసెంట్గా వేట్టాయన్ నుంచి టీజర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రంలోని సంభాషణలు చట్ట విరుద్ధంగా ఎన్ కౌంటర్‌లను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని ఓ వ్యక్తి కోర్టుకెక్కారు. సినిమా రిలీజ్ కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, సెప్టెంబరు 20న వేట్టయాన్ ప్రివ్యూ పేరుతో మూవీ టీమ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ‘అత్యంత భయంకరమైన క్రిమినల్స్‌ను అస్సలు భయపడకుండా ఎన్‌కౌంటర్ చేయడం వల్లే వీళ్లు హీరోలు అయ్యారు అంటూ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. వీటిపైనే సదరు పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి చట్టవిరుద్ధ ఎన్‌కౌంటర్‌లు ప్రోత్సహించేలా, ప్రజల ఆలోచనా దృక్పథాన్ని మార్చేలా ఉన్నాయని అన్నారు. ఆ డైలాగ్‌లను తొలగించడం లేదా మ్యూట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన పిటీషనల్ పిల్లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ విక్టోరియా గౌరీల ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం సీబీఎఫ్‌సీ (కేంద్ర చలన చిత్ర సెన్సార్ బోర్డు), నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే సినిమాపై మధ్యంతర నిషేధం విధించాలన్న అన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సీబీఎఫ్‌సీ, లైకా ప్రొడక్షన్స్ స్పందన ఆధారంగా తదుపరి విచారణ ఉంటుందని పేర్కొంది.
వేట్టాయన్ సినిమా విషయానికొస్తే - జై భీమ్ లాంటి విజయం తర్వాత టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఇది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజువారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇతర పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటివరకు రిలీజైన ప్రచార చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి.