Maa Nanna Superhero Review : సినిమా: మా నాన్న సూపర్ హీరో; నటీనటులు: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, దేవి ప్రసాద్ తదితరులు; దర్శకుడు: అభిలాష్ రెడ్డి కంకర; సంగీతం: జై క్రిష్; సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి; రచన: భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర; నిర్మాత: సునీల్ బలుసు; రిలీజ్ డేట్: 11-10-2024
టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్‌బాబు నుంచి ఇటీవల కాలంలో యాక్షన్ చిత్రాలే వచ్చాయి. ఇప్పుడు ఆయన రూటు మార్చి 'మా నాన్న సూపర్ హీరో' అనే ఓ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌తో వచ్చారు. మరి దసరా సందర్భంగా శుక్రవారం (అక్టోబర్ 11) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు మెప్పించిందా? సుధీర్‌ను సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కించిందా?
కథేంటంటే: జానీ (సుధీర్‌బాబు) పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకుంటాడు. కన్నతండ్రి ప్రకాశ్ (సాయిచంద్) చేయని తప్పునకు జైలుకు వెళ్తాడు. దీంతో జానీ అనాథశ్రమంలో పెరుగుతాడు. ఆ తర్వాత అతడని శ్రీనివాస్ (సాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. మొదట్లో సొంత కొడుకులా ప్రేమగానే చూసుకున్నప్పటికీ, భార్య (ఆమని)ను కోల్పోవడం, స్టాక్ మార్కెట్‌లో దెబ్బతిని ఆర్థికంగా చితికిపోతాడు. అయితే దీని అంతటికీ జానీని ఇంటికి తెచ్చుకోవడమే కారణమని భావించి, అతడిపై ద్వేషం పెంచుకుంటాడు.
కానీ, జానీ మాత్రం తనకు ఓ కుటుంబాన్ని ఇచ్చిన శ్రీనివాస్‌ను సొంత తండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఓ హీరోలా ఆరాధిస్తుంటాడు. స్టాక్‌మార్కెట్‌లో భారీ లాభాలొస్తాయని చెప్పి ఊళ్లోని ఓ నాయకుడితో శ్రీనివాస్ భారీ మొత్తంలో షేర్లలో పెట్టుబడులు పెట్టిస్తాడు. అందులో తీవ్ర నష్టాలు రావడం వల్ల ఆ నాయకుడు శ్రీనివాస్‌ను జైల్లో పెట్టించి హింసించడం మొదలు పెడతాడు. దీంతో తండ్రిని రక్షించుకునేందుకు ఆ అప్పు బాధ్యతను తన భుజానికెత్తుకుంటాడు. ఇందుకోసం కోటి రూపాయలు కావాల్సి వస్తుంది. మరోవైపు 20ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ప్రకాశ్ తన బిడ్డను వెతుక్కుంటూ ప్రయాణం ప్రారంభిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? జానీ తన తండ్రిని కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో ప్రకాశ్‌తో కలిసి ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది? జానీనే తన కొడుకని ప్రకాశ్‌కు ఎలా తెలిసింది? అన్నది మిగిలిన కథ.
ఎలా సాగిందంటే: ఇది ఓ కొడుకు ఇద్దరు తండ్రుల ట్రై యాంగిల్ ప్రేమకథ. ఇందులో ఈతరం ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం ఉంది. మనసుల్ని హత్తుకునేలా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే, దర్శకుడు అభిలాష్ రెడ్డి పేపర్‌పై రాసుకున్న ఎమోషన్స్‌ను అంతే రేంజ్లో తెరపై చూపించడంలో కొంత తడబడ్డాడు. ముఖ్యంగా కథలో బలమైన సంఘర్షణ, పాత్రల ఎమోషన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోయారు. ప్రకాశ్ తన బిడ్డకు ఎలా దూరమయ్యాడన్న కథతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత కథ జానీ - శ్రీనివాస్ చుట్టూ తిరుగుతుంది. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు బాగా పండాయి.
ప్రకాశ్ జైలు నుంచి విడుదలై తన కొడుకును వెతకడం ప్రారంభిస్తాడు. అప్పట్నుంచే కథలో ఓ సంఘర్షణతో పాటు ఎమోషనల్ డ్రామా మొదలవుతుంది. మరోవైపు జైలుకెళ్లిన శ్రీనివాస్‌ను కాపాడుకునేందుకు జానీకి కోటి రూపాయలు అవసరపడటం, అదీ 20రోజుల్లోనే సర్దుబాటు చేయాల్సి రావడం కథను రసవత్తరంగా మారుస్తుంది. సరిగ్గా ఇక్కడే ప్రకాశ్ కథలోకి జానీని తీసుకురావడం, మహేశ్ పేరుతో జానీ ఆడే డ్రామా విరామ సన్నివేశాల్ని ఆసక్తికరంగా మార్చాయి. ఇక్కడి నుంచి సెకండ్ హాఫ్ ప్రకాశ్- జానీ చుట్టూ తిరుగుతుంది. వీరికి ఓ ట్రావెల్ ట్రాక్‌ను సెట్ చేశాడు దర్శకుడు. కాకపోతే దాన్ని ఎమోషనల్ డ్రామాగా చూపించలేకపోయారు. ప్రీ- క్లైమాక్స్‌లో డబ్బు కోసం ప్రకాశ్ - జానీ మధ్య నడిచే చిన్న పోరు ఈ క్రమంలో పండే భావోద్వేగ సంఘర్షణ కథను కాస్త ఆసక్తికరంగా మార్చాయి.
బలాలు
- + కథలోని కొత్తదనం
- + సుధీర్‌బాబు, సాయిచంద్ నటన
- + విరామ సన్నివేశాలు
బలహీనతలు
- - నెమ్మదిగా సాగే కథ
- - కొరవడిన భావోద్వేగాలు
చివరిగా: భావోద్వేగాలు బలంగా పండుంటే నిజంగానే 'మా నాన్న సూపర్ హీరో' అయ్యేవాడు!