Shreya Ghoshal On RG Kar Case Song : పశ్చిమ బంగాల్ కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించిన నిరసనలు ఇంకా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ గతంలో తన కాన్సర్ట్‌ను వాయిదా వేసుకుంది. అయితే తాజాగా ఆమె ఆ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఆల్ హార్ట్స్ టూర్‌లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఘనంగానే ఈ ఈవెంట్ జరిగింది.
ఈ ఈవెంట్లో శ్రేయా ఘోషల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఎమోషనల్ సాంగ్‌ను ఆలపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు మీరు వింటున్నారు" అంటూ సాగే సాంగ్‌ను శ్రేయా ఘోషల్ ఉద్వేగభరింతగా పాడింది. ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎదుర్కొనే బాధ, వారి ఆవేదనను ఆమె ఈ పాట రూపంలో తెలిపింది. ఈ సాంగ్‌కు ఎవరూ చప్పట్లు కొట్టొద్దని ఆడియెన్స్‌కు విజ్ఞప్తి చేసింది. ఆమె పాట పాడడం పూర్తయ్యాక శ్రోతలు వీ వాంట్ జస్టిస్ నినాదాలతో స్టేడియం మొత్తాన్ని హోరెత్తించారు.
ప్రశంసించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు - శ్రేయ ఘోషల్ ఈవెంట్‌పై, ఆమె పాడిన పాటపై తృణముల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కునాల్ ఘోష్ ప్రశంసించారు. ఓ పోస్ట్ కూడా పెట్టారు. "ఈ ఘటనపై శ్రేయా ఘోషల్ ఎంతో బాధపడ్డారు. కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇప్పుడు మహిళల భద్రతపై పాటను పాడి హృదయాలను కదిలించారు. హత్యాచారాల ఘటనలపై నిరసనలు అవసరం" అని పేర్కొన్నారు.
ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనపై శ్రేయా ఘోషల్ గతంలోనూ స్పందించింది. దీని గురించి తెలిసినప్పుడు తన వెన్నులో వణుకు పుట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది క్రూరమైన చర్య అని, తనపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది.
Hear a Tigress roar at her recent #ShreyaGhoshalLiveInKolkata for the times we are going through! 🙏 pic.twitter.com/UMJXicdlCf
— Shreya Ghoshal (Fan) #SGTribe 🇮🇳 (@shreyaghoshalf4) October 19, 2024
అర్జిత్ సింగ్ కూడా - ఈ ఘటనపై స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ కూడా ఓ బెంగాలీ పాటతో నిరసనలకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని కోరాడు. "న్యాయం కోసం ఆవేదనతో ఈ పాటను పాడాను. మౌనంగా బాధపడుతున్న అసంఖ్యాక మహిళల కోసం మార్పును కోరుకునే వారికోసం ఈ పాట. మరణించిన వైద్యురాలి ధైర్యాన్ని కీర్తిస్తున్నాను. భయంకరమైన హింసను ఎదుర్కొంటున్న మహిళలందరికీ సంఘీభావం తెలుపుతున్నాను" అంటూ అర్జిత్ సింగ్ పాట పాడాడు.