Shankar Daughter Reception : స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. రజినీకాంత్, సూర్య, విక్రమ్, నయనతార దంపతులు సుహాసిని, మణిరత్నం లాంటి ప్రముఖులు ఈ పెళ్ళికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో వీరి రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిగింది.
ఇక టాలీవుడ్ నుంచి చిరంజీవి ఫ్యామిలీ కూడా వచ్చి సందడి చేసింది. చిరు, సురేఖ దంపతులు రామ్ చరణ్ ఉపాసన దంపతులు రిసెప్షన్‌కు వచ్చి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సింపుల్ లుక్‌లో వచ్చినప్పటికీ చెర్రీ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకకు శివకార్తికేయన్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, నెల్సన్, అనిరుథ్, డ్రమ్స్ ప్లేయర్ శివమణి, విజయ్ సేతుపతి, వెట్రిమారన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రుతి హాసన్, నిర్మాత అల్లు అరవింద్, మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ లాంటి ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మరోవైపు ఇదే రిసెప్షన్‌కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కూడా వచ్చారు. ఆయన ఎప్పటిలాగే తన ప్రెజన్స్‌తో అక్కడివారిని ఆకట్టుకున్నారు. స్టేజీపై డ్యాన్స్ చేసి సందడి చేశారు. డైరెక్టర్ అట్లీ, రణ్వీర్ సింగ్ కలిసి వాతి కమింగ్తో పాటు పలు తమిళ సాంగ్స్‌కు స్టెప్పులేసి అలరించారు. వీరితో పాటు వధూవరులు, అలాగే డైరెక్టర్ శంకర్ చిన్న కుమార్తె అదితి శంకర్ కూడా డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'తో పాటు కమల్ హాసన్ 'భారతీయుడు 2' సినిమాలను రూపొందిస్తున్నారు. రెండు సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.