Satyabhama Movie Kajal Agarwal : సాధరణంగా సినీ తారలు కళ్ల ముందు కనపడగానే తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు ఫ్యాన్స్. అదే తాము ఆరాధించే నటులు కనిపిస్తే ఫ్యాన్స్ మరింత ఉత్సుకత చూపిస్తూ ఫొటోలు దిగేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే మరి కొందరు మాత్రం కాస్త హద్దులు దాటి మరీ ప్రవర్తిస్తుంటారు. దీని వల్ల తారలు కాస్త ఇబ్బందికి గురైన సందర్భాలు కూడా చాలానే చోటు చేసుకున్నాయి.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని చెప్పింది. 'సత్యభామ' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ సినిమా చిత్రీకరణలో ఎదురైన ఈ సంఘటనను గుర్తుచేసుకుంది.
"కొనేళ్ల క్రితం ఓ సినిమా చిత్రీకరణలో నేను పాల్గొన్నాను. మొదటి రోజు షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ పర్మిషన్ లేకుండానే నా వ్యానిటీ వ్యాన్‌లోకి వచ్చేశాడు. షర్ట్ విప్పి తన ఛాతీపై ఉన్న నా పేరు టాటూని చూపించాడు. అయితే ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో అతడు అలా రావడం వల్ల భయపడ్డాను. నాపై అతడు అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో చూపించినందుకు ఆనందమే. కానీ అలా చేయడం కరెక్ట్ కాదని నేను సున్నితంగా చెప్పాను" అని కాజల్ గుర్తుచేసుకుంది.
కాగా, సౌత్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న చందమామ కాజల్ అగర్వాల్ గత రెండు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. కరోనా సమయంలో వివాహ బంధంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ ఇప్పుడు జోరు కొనసాగిస్తోంది. ఓ వైపు తన బాబు ఆలనా పాలనా చూసుకుంటూనే ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సత్యభామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో పోషించారు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.