Saif Ali Khan Attack : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయనపై కత్తితో దాడి చేసిన దుండగుడు తొలుత కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆయన 4 ఏళ్ల కుమారుడు జహంగీర్ ఉన్న గదిలోకి దొంగ రావడాన్ని అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఎలియామా ఫిలిప్స్ గుర్తించారు. రాత్రి 2 గంటలకు శబ్దాలు రావడం వల్ల నర్సుకు మెలకువ వచ్చింది. అయితే బిడ్డను చూసేందుకు కరీనా కపూర్ వచ్చి ఉంటుందని ఆమె భావించింది.
అయితే అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లగా, దొంగ ఆమెను పట్టుకుని నిశ్శబ్ధంగా ఉండాలని బెదిరించాడు. ఆ సమయంలో కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతడిని పట్టుకునే క్రమంలో నర్సు మణికట్టుపై నిందితుడు కత్తితో పొడిచాడు. అలికిడి కావడం వల్ల సైఫ్ అక్కడకు వచ్చి దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఆయనపై కూడా దాడి జరిగిందని పోలీసులు వివరించారు.
ఇదిలా ఉండగా, దుండగుడిని పట్టుకునేందుకు ముంబయి పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు. కర్ర, ఆక్సా బ్లేడుతో పారిపోతున్న నిందితుడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అందులో అతడి ముఖం స్పష్టంగా కనిపించింది.
మరోవైపు ఈ ఘటన నుంచి కోలుకోవడానికి తన కుటుంబానికి సమయం ఇవ్వాలని కరీనాకపూర్ విజ్ఞప్తి చేశారు. తమ గోప్యతను గౌరవించాలని కోరారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
'మా కుటుంబానికి ఇది ఎంతో సవాలుతో కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కఠినమైన సమయంలో మాకు మద్దతుగా నిలిచినవారందరికి కృతజ్ఞతలు. మీడియా, ఫ్రీలాన్సర్లు కాస్త సంయమనం పాటించాలని, ఊహాజనిత కథనాలు అలాగే కవరేజీకి దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాపై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ, ఇలాంటి చర్యల వల్ల మా భద్రతను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా" అని సోషల్ మీడియాలో కరీనా పోస్ట్ చేశారు.
'ఇది మా ఫ్యామిలీకి బ్యాడ్ డే!'- కరీనా కపూర్
సైఫ్‌పై దాడి చేసిన నిందితుడి ఫొటో రిలీజ్- అత్యవసర మెట్ల మార్గం నుంచి ఇంట్లోకి!