Razakar Movie Review: సినిమా: రజాకార్; నటీనటులు: బాబీ సింహా, వేదిక, అనసూయ, ఇంద్రజ, ప్రేమ, మకరంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్, తేజ్ సప్రు, జాన్ విజయ్, దేవీ ప్రసాద్ తదితరులు; రచన, దర్శకత్వం: యాట సత్యనారాయణ; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఛాయాగ్రహణం: కె.రమేష్ రెడ్డి; నిర్మాత: గూడూరు నారాయణ రెడ్డి; విడుదల తేదీ: 15-03-2024
'రజాకార్' సినిమాను డైరెక్టర్ సత్యనారాయణ తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో తెరకెక్కించారు. కొంత కాలంగా పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ మూవీ శుక్రవారం (మార్చి 15)న థియేటర్లలో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ఏమైనా వివాదాస్పదమైన అంశాలు ఏమైనా ఉన్నాయా?
కథేంటంటే: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానం నిజాం ఏడో రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలోనే ఉన్న రోజులవి. దేశంలోని అన్ని రాజ్యాలను, సంస్థానాలను భారత్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ, నిజాం మాత్రం అందుకు ఒప్పుకోడు. తన ప్రైవేటు సైన్యం సహకారంతో హైదరాబాద్ సంస్థానాన్ని తుర్కిస్థాన్ అనే దేశంగా ఏర్పాటు చేయాలనుకుంటాడు.
అందుకని అప్పటి రజాకార్ల చీఫ్ ఖాసిం రిజ్వీ హిందువులను బలవంతంగా మతమార్పిడులు చేయాలని ప్రయత్నిస్తారు. తెలుగు, కన్నడ, మరాఠి తదితర భాషలపై నిషేధం విధించి ఉర్దూని అధికార భాషగా ప్రకటిస్తారు. అలాగే ప్రజలపై ఇష్టారితిన పన్నులు విధిస్తూ వారిని హింతిస్తుంటారు. అయితే అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిజాం అరాచరాలు తెలుసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు చర్యలు చేపడతారు. మరి ఆ తర్వాత ఏమైంది? ప్రజలు ఎలాంటి పోరాటం చేశారు? భారత ప్రభుత్వ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా? అనే అంశాలు బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
ఎలా సాగిందంటే: తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రపంచంలోని పోరాటాల్లోకెల్లా ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో నిజాం రాజు అరాచకాలు, ప్రజలను ఎలా హింసించారో చూపించారు. వారిని ఎదిరించి ప్రజలు పోరాడిన తీరు, ఈ పోరాటంలో వీర మరణం పొందిన సాయుధులు, తెలంగాణ చరిత్రను సినిమా రూపంలో చూపించే ప్రయత్నమే 'రజాకార్'. ముందుగా తెలంగాణ చరిత్రను పరిచయం చేసి, స్వాతంత్ర్యం తర్వాతి పరిస్థితులు, హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలలను చూపించారు.
ఆ తర్వాత రజకార్ల అరాచకాలు ఒక్కొక్కటిగా చూపిస్తూ కథను ముందుకు నడిపించారు. ప్రజల్ని మతం మార్పించిన తీరు, తెలుగు భాషపై నిషేధం, ఊళ్లలో మహిళలు, ఆడపిల్లలపై వారి అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ఈ కథలో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ కనిపించరు. ప్రతి 15 నిమిషాలకొకసారి కథలో శక్తిమంతమైన పాత్ర తెరపైకి వస్తుంటుంది.
ఇక ఫస్ట్ హాఫ్‌లో రజాకార్ల అరాచకాలు చూపిస్తే, సెకండ్ హాఫ్‌లో వారిపై ప్రజల తిరుగుబాటును చూపించారు. ఈ క్రమంలో వచ్చే బైరాన్‌పల్లె వాసుల సాయుధ పోరాటం, పరకాల జెండా ఉద్యమం, ఈశ్వరయ్య-గండయ్య గ్యాంగ్ నిజాం ప్రభువుపై చేసే బాంబ్ ఎటాక్ ఎపిసోడ్ ఇలా అన్ని సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్‌ల పాత్ర ఎంతో కీలకం. కానీ, సినిమాలో మాత్రం భారత సైన్యం కారణంగానే వాళ్లు ఉద్యమం నుంచి పక్కకు తప్పుకొన్నట్లు చూపించారు. అది అంత సహేతుకంగా అనిపించదు.
బలాలు
- కథ, స్క్రీన్ ప్లే
- ప్రధాన తారాగణం నటన
- చరిత్రలోని ఘటనల్ని ఆవిష్కరించిన తీరు
బలహీనతలు
- తెలిసిన కథ కావడం..
- మితిమీరిన హింస
చివరిగా: నాటి పోరాటానికి అద్భుత తెరరూపం ‘రజాకార్’
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!