Prithvi Raj Cinema Career : మలయాళంలోనే కాదు అన్ని దక్షిణాది భాషాల్లోనూ మంచి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. మల్లు ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఈ యాక్టర్ 'సలార్', 'ఆడు జీవితం' ( ది గోట్ లైఫ్) ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. అయితే సినీ నేపధ్యమున్న కుటుంబం నుంచే వచ్చినా తను ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
"కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు నేను ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. ఎందుకుంటే నా ఫస్ట్ మూవీ అవకాశం నాకు నా ఇంటి పేరు వల్లే వచ్చింది. సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను మంచి నటుడిని అన్న నమ్మకంతోనే ఆ చిత్రంలో తీసుకున్నారు. అప్పుడు నాకు స్క్రీన్ టెస్ట్ కూడా చేయలేదు. అయితే అలా మొదటి ఫిల్మ్ ఛాన్స్ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత నేను చాలా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాను. ఒకానొక సమయంలో మలయాళంలో ఓ మూడు సినిమాల్లో నన్ను తీసుకున్నట్టే తీసుకుని మళ్లీ వద్దన్నారు. అందులో రెండు సినిమాల నుంచి నన్ను అసలు ఎందుకు తీశారో కూడా చెప్పలేదు. చాలాకాలం పాటు చేతిలో ఏ పని లేకుండా ఖాళీగానే ఉండాల్సి వచ్చింది" అంటూ తాను ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు.
'సలార్' ద్వారా పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకున్న పృథ్వీరాజ్, 'గోట్ లైఫ్' చిత్రం ద్వారా విలక్షణ నటుడిగా పేరొందారు. ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్తో 'L2 ఎంపురాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. టోవినో థామస్, ఇంద్రజిత్, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ బాషల్లో తెరకెక్కుతోంది.