IC 814 The Kandahar Hijack Netflix: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ లీడ్ రోల్లో నటించిన 'ఐసీ 814: ది కాంధార్ హైజాక్' వెబ్ సిరీస్‌లో కొన్ని అంశాలపై కొంతకాలంగా దుమారం రేగుతోంది. ఈ క్రమంలోనే సిరీస్‌లో చూపించిన వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు కేంద్రం నుంచి సమన్లు అందాయి. నోటీసులకు స్పందించిన కంటెంట్ హెడ్ సారథి మోనికా షెర్గిల్ మంగళవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు హాజరయ్యారు. కంటెంట్ విషయంలో తాము రివ్యూ చేస్తామని ఈ సందర్భంగా ఆమె కేంద్రానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో కేంద్రం అధికారులు నెట్‌ఫ్లిక్స్‌కు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. 'హైజాకర్ల వాస్తవ పేర్లను స్పష్టంగా తెలియజేసేలా స్క్రీన్‌పై క్యాప్షన్లు లేదా రైడర్లు ఎందుకు ఇవ్వలేదు? హైజాకర్లను మానవత్వం ఉన్నవారిగా చూపిస్తూ, మధ్యవర్తులను బలహీనపరులుగా, గందరగోళానికి గురవుతున్నవారిగా ఎందుకు చూపించారు?' అని కేంద్రం ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కంటెంట్‌ను రివ్యూ చేస్తామని నెట్‌ఫ్లిక్స్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఫ్యూచర్లో కూడా దేశ ప్రజల మనోభానాలు దెబ్బతినకుండా ఉండే కంటే కంటెంట్‌ను ప్రసారం చేస్తామని నెట్‌ఫ్లిక్స్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చిన్నారులకు సంబంధించిన కంటెంట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని ఓటీటీ సంస్థ పేర్కొన్నట్లు సమాచారం.
ఇదీ వివాదం:
1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC-814 విమానాన్ని పాకిస్థాన్‌కు చెందిన హర్కత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ హైజాక్ చేసింది. ఖాట్‌మండూ నుంచి దిల్లీ వస్తున్న ఈ విమానాన్ని అందులో ప్రయాణికుల మాదిరిగా నక్కిన ఐదుగురు ముష్కరులు హైజాక్ చేసి అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. 2000 సంవత్సరం జనవరి 6న కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ఉగ్రవాదుల పేర్లు ఇబ్రహీం అక్తర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సున్నీ అహ్మద్ ఖాజీ, మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, షకీర్ అని వెల్లడించింది. అయితే నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌లో హైజాకర్లకు హిందూ పేర్లను పెట్టడంపై బీజేపీ నేతలతోపాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాందహార్ హైజాక్ వెబ్‌సిరీస్‌పై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది