IC 814 The Kandahar Hijack: కాందహార్ హైజాక్ ఘటనపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న వెబ్‌సిరీస్ 'IC-814'లో కొన్ని అంశాలపై దుమారం రేగుతోంది. వెబ్‌సిరీస్‌లో హైజాకర్లకు పెట్టిన పేర్లపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైజాకర్లు ఉగ్రవాదులనే విషయం అందరికీ తెలిసినప్పటికీ వారి వర్గాన్ని కప్పిపుచ్చేలా పేర్లు పెట్టారంటూ బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను పక్కదారి పట్టించేలా వెబ్‌సిరీస్ దర్శకుడు అనుభవ్ సిన్హా హైజాకర్లకు హిందువుల పేర్లు పెట్టారని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మండిపడ్డారు. హైజాక్ జరిగిన దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ వెబ్‌సిరీస్ ప్రజలు, పోలీసులను తప్పుదారి పట్టించేలా ఉందని ఆయన విమర్శించారు.
హిందువులు విమానాన్ని హైజాక్ చేశారనేలా ప్రజలను మభ్యపెడుతున్నారని అమిత్ మాలవీయ ధ్వజమెత్తారు. పాకిస్థానీ ఉగ్రవాదుల నేరాలను కప్పిపుచ్చేలా ఈ వెబ్‌సిరీస్ ఉందని ఆయన మండిపడ్డారు. ఇదంతా వామపక్షాల ఎజెండాఅంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇది దేశ భద్రతను ప్రశ్నించేలా ఉండడం సహా దీర్ఘకాలంలో మతాల పరంగా తప్పుడు సంకేతాలు పంపుతోందని విమర్శించారు. ఉదేశపూర్వకంగానే హైజాకర్ల పేర్లను మార్చారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదులైన హైజాకర్లకు భోలా, శంకర్ అనే పేర్లు పెట్టడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC-814 విమానాన్ని పాకిస్థాన్‌కు చెందిన హర్కత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ హైజాక్ చేసింది. ఖాట్‌మండూ నుంచి దిల్లీ వస్తున్న ఈ విమానాన్ని అందులో ప్రయాణికుల మాదిరిగా నక్కిన ఐదుగురు ముష్కరులు హైజాక్ చేసి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. 2000 సంవత్సరం జనవరి 6న కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ఉగ్రవాదుల పేర్లు ఇబ్రహీం అక్తర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సున్నీ అహ్మద్ ఖాజీ, మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, షకీర్ అని వెల్లడించింది.
అయితే నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌లో హైజాకర్లకు హిందూ పేర్లను పెట్టడంపై బీజేపీ నేతలతోపాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాందహార్ హైజాక్ వెబ్‌సిరీస్‌పై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్‌కు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సమన్లు జారీచేసింది. వెబ్‌సిరీస్‌లోని అంశాలపై వివరణ ఇవ్వాలని సమన్లలో పేర్కొంది. మరోవైపు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెబ్‌సిరీస్‌పై తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో వాస్తవాలను వక్రీకరించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్న ఆయన ఇప్పుడు కాందహార్ హైజాక్ వెబ్‌సిరీస్‌లో మాత్రం వాస్తవాలే ఉండాలంటున్నారని విమర్శించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొట్టిన ఇండియన్ సినిమాలు- టాప్ మూవీస్ ఇవే! - Netflix Viewership Report 2023