Game Changer Actor Srikanth Meka Special Interview : నేనెప్పుడూ ఊహించని ఓ గొప్ప అవకాశం 'గేమ్ ఛేంజర్'తో లభించింది అని టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. అంతేకాకుండా డైరెక్టర్ శంకర్‌తో పనిచేయడం ఓ గొప్ప అనుభూతి అని అన్నారు. రామ్‌చరణ్ -శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' జనవరి 10న ప్రేక్షకుల రానుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో శ్రీకాంత్ మెరిశారు. ఈ క్రమంలో చిత్రం విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ఆయన ముచ్చటించారు. ఆ విషయాలు తన మాటల్లోనే
శంకర్ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంటాయి. అయితే ఆయన సినిమాలో నటించే ఛాన్స్ వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన నుంచి ఫోన్ కాల్ రాగానే ఒక్కసారిగా షాకయ్యాను. అటువంటి డైరెక్టర్‌తో కలిసి వర్క్ చేయాలనే కోరిక ప్రతి నటుడికీ ఉంటుంది. అయితే ఇటువంటి పాత్రలో కనిపించే అవకాశం రావడం నాకు చాలా ప్రత్యేకం. ఆయన ఫస్ట్‌హాఫ్ స్టోరీతో పాటు నా పాత్ర గురించి చెప్పినప్పుడు ఈయన ఇది నాకెందుకు చెబుతున్నారా అని అనిపించింది. కానీ సెకెండాఫ్ స్టోరీ కంప్లీట్ అయ్యాక మాత్రం ఈ పాత్రని కచ్చితంగా నేనే చేయాలని నిశ్చయించుకున్నా. అంతలా నచ్చిందా పాత్ర నాకు. అన్ని రకాల భావోద్వేగాలున్న ఓ ముఖ్యమంత్రి పాత్ర అది.
అయితే పాత్ర ఒకెత్తైతే, ఆ పాత్ర కోసం నేను వేసిన గెటప్ మరో ఎత్తు. మా నాన్నగారి ఫొటోని చూసి మేకర్స్ డిజైన్ చేసిన పాత్ర అది. ఒక్క ప్రాస్థెటిక్ మేకప్ కోసమే సుమారు నాలుగు గంటలు పట్టేది. అయితే ఇటువంటి మేకప్‌తో నటించడం నాకు కూడా ఇదే తొలి అనుభవం. కానీ ఒక్కసారి గెటప్ వేశాక వెంటనే ఆ పాత్రకి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ వాటంతట అవే వచ్చేశాయి. వాటి కోసం ప్రత్యేకంగా ఎవరినీ ఇమిటేట్ చేసింది లేదు. కానీ మా నాన్నలా నేను కనిపిస్తానా? లేకుంటే ఆ గెటప్ నాకు సెట్ అవుతుందా అనే అనుమానాలు చాలానే ఉండేవి.
అప్పుడే ఆ గెటప్ వేసుకుని ఓ రోజు నేను నేరుగా ఇంటికి వెళ్లాను. మా అమ్మ నన్ను చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆమె రియాక్షన్ చూశాక ఆ గెటప్ నాకు ఎంత బాగా కుదిరిందో అర్థమైంది. రామ్‌చరణ్, జయరాం, ఎస్.జె.సూర్య, సముద్రఖని లాంటి స్టార్స్‌తో నాకు సీన్స్ ఉన్నాయి. అయితే రామ్‌చరణ్‌తో కలిసి ఇదివరకే నటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా, నటుడిగా ఆయన చాలా ఎదిగాడు. ఇందులో అప్పన్న పాత్రలో తన నటని చూసి అంతా షాక్ అవుతారు. తను అందులో చాలా కొత్తగా కనిపిస్తాడు.
డైరెక్టర్ శంకర్ తీసిన సినిమాలు సరైన ఫలితాలను సాధించకపోవచ్చు కానీ, ఓ డైరెక్టర్‌గా మాత్రం ఆయన ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. రాజకీయ కోణం ఉన్న ఈ సినిమాని మంచి మలుపులతో ఎంతో చక్కగా తీశారు. ఆయన ప్రతి సినిమాలాగే ఈ చిత్రంలోనూ ఓ బలమైన సోషల్ మెసేజ్ ఉంది.
రూ. 10 కోట్ల బడ్జెట్, 6 రోజుల షూట్!: 'గేమ్ ఛేంజర్' నానా హైరానా సాంగ్ విశేషాలివే