Balakrishna Bhairva Dweepam Movie: నందమూరి బాలకృష్ణ గురించి పర్సనల్‌గా తెలిసిన వారికి మాత్రమే ఆయన అంకిత భావం, సమయపాలన గురించి తెలుస్తుంది. టైం కంటే ముందే షూటింగ్ స్పాట్‌కు వచ్చి తన వల్ల ప్రొడ్యూసర్‌తో పాటు ఇతర నటులు ఇబ్బంది పడకుండా చూసుకుంటారు. బాలయ్య కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే పద్ధతి ఫాలో అవుతుంటారు. అందుకే అంత సక్సెస్ అయ్యారు. వీటితో పాటు నటనకు, పాత్రలకు పరిధులు పెట్టుకోకుండా దర్శకుడు చెప్పినట్లుగా చేసి ప్రజాభిమానం సంపాదించుకోగలిగారు.
ఇండస్ట్రీకి 1984లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. పదేళ్ల పాటు శ్రమించి మంచి మాస్ ఇమేజ్‌తో పాటు స్టార్‌గా ఎదిగారు. అటువంటి సమయంలో ఆయన 'భైరవద్వీపం' సినిమా చేయడం అభిమానులనే కాదు ఇండస్ట్రీని సైతం షాకింగ్‌కు గురి చేసింది. అప్పటికే 'రౌడీ ఇన్‌స్పెక్టర్', 'నిప్పురవ్వ', 'బంగారు బుల్లోడు' వంటి మాస్ సినిమాలతో దూకుడు మీదున్నారు బాలకృష్ణ. అలాంటి సమయంలో జానపద కథను ఎంచుకోవడం మాత్రమే కాదు అందులో ఆయన కురూపిగా కనిపించడమే అసలైన మ్యాటర్. ప్రస్తుత సినిమాల్లో అది కామన్ అయిపోయింది కానీ, 1994 టైంలోనే బాలకృష్ణ ఆ ప్రయోగం చేసేశారు. పైగా దానికి ముందుగా ప్రజలు షాక్ అయినా ఆ తర్వాత బ్రహ్మరథం పట్టారు. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీసును షేక్ చేసి కాసుల వర్షం కురిపించింది.
అయితే బాలయ్య ఈ జానర్‌కు ఎలా ఓకే చెప్పారో డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన రోల్ గురించి కూడా వివరించారు."అప్పటికే మంచి గ్లామర్, మాస్ హీరో అనే ఇమేజ్ తెచ్చుకున్నారు బాలకృష్ణ. అటువంటి సమయంలో బైరవ ద్వీపం సినిమా కథ వినిపించి ఇందులో కురూపిగా నటించాలని చెప్తే వెంటనే ఓకే అనేశారు. మరో హీరో అయితే రెండు మూడు సార్లు ఆలోచించే వారేమో. కథను, దర్శకుడ్ని అలా నమ్మేస్తారు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగులో ఆయనకు కురూపి గెటప్ వేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టేది. ఉదయం మేకప్ వేస్తే సాయంత్రం వరకూ అలానే ఉండాలి.
లంచ్ టైంకి మేకప్ తీసేస్తే మళ్లీ వేసుకోవడానికి ఇంకో రెండు గంటల సమయం వేస్ట్ అవుతుందని అన్నం తినడం కూడా మానేశారు బాలయ్య. ఆ గెటప్ వేసుకున్న రోజులన్నీ లంచ్ సమయంలో కేవలం జ్యూస్ మాత్రమే తాగేవారు. తన తల్లి కోసం హీరో పాత్ర కొండలు, రాళ్లు, నీళ్లలో నడుచుకుంటూ రావాలి. అలా నడిచి వస్తుంటే ఆయన కాళ్లలో రాళ్లు, ముళ్లు దిగబడిపోయాయి. అవేమీ లెక్క చేయకుండా షూటింగ్ పూర్తి చేశారు బాలయ్య. సినిమా రిలీజ్ వరకూ కురూపిగా కనిపిస్తారని ఎవరికీ తెలియదు. థియేటర్లో ఆ పాత్రను చూడగానే అభిమానులు ఒక్కసారిగా షాకైపోయారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడానికి ఆయనే కారణం" అని సింగీతం శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.