Ashmit Patel Movie Career : మూవీ ఇండస్ట్రీలో ప్రారంభంలోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకుని, అనుకోని సమస్యలతో కెరీర్ పోగొట్టుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. 2000 సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్ ఇండస్ట్రీ కొత్త జోష్‌లో ఉంది. హాలీవుడ్ స్ఫూర్తితో ఊహించని ట్విస్ట్‌లతో సినిమాలు రూపొందాయి. కొత్త నటీనటులు ఇండస్ట్రీపై పెద్ద ప్రభావం చూపారు. ఆ సమయంలో సినిమాల్లోకి అడుగుపెట్టిన వారిలో అష్మిత్ పటేల్ కూడా ఉన్నారు. ఆయన చాలా త్వరగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓనర్‌నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు.
అష్మిత్ యాక్ట్ చేసిన రెండో సినిమా ఆ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఊహించని ఘటనతో అతడి కెరీర్ ముగిసిపోయింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన జై హో సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చారు. ప్రస్తుతం అష్మిత్ పటేల్ ఒక ప్రొఫెషనల్ డీజేగా పని చేస్తున్నారు. పాపులర్ హీరోయిన్ అమీషా పటేల్ సోదరుడు అయిన అష్మిత్ కెరీర్‌కి సంబంధించిన ఆస్తికర అంశాలు ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్‌లో బిగ్ బ్రేక్
అష్మిత్ పటేల్ యాక్టింగ్‌లోకి రాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ (AD)గా పనిచేశారు. అతను 'రాజ్', 'ఆవారా పాగల్ దీవానా', 'ఆప్ ముజే అచ్చే లగ్నే లగే' వంటి పాపులర్ సినిమాలకు పని చేశారు. మొదట 2003లో 'ఇంతేహా' అనే మూవీలో విద్యా మాలవాడే, నౌహీద్ సైరూసితో కలిసి నటించారు. తర్వాత 2004లో అనురాగ్ బసు దర్శకత్వం వహించిన 'మర్డర్'లో కనిపించారు. ఈ మూవీలో చేసిన పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లు వసూలు చేసి హిట్‌గా నిలిచింది. ఈ సంచలన విజయానికి మల్లికా షెరావత్, ఇమ్రాన్ హష్మీ నటించిన బోల్డ్ సీన్‌లే కారణమని చెప్పవచ్చు. దీని తర్వాత అష్మిత్‌కు వరుసగా ఆఫర్‌లు వచ్చాయి. 'నాజర్', 'సిల్సిలే', 'ఫైట్ క్లబ్', 'బనారస్', 'దిల్ దియా హై', 'కుడియోన్ కా హై జమానా' సహా అనేక మూవీల్లో నటించారు.
ప్రమాదంలో పడిన కెరీర్
దురదృష్టవశాత్తూ, అష్మిత్ కెరీర్ ఒక వ్యక్తిగత ఘటనతో పట్టాలు తప్పింది. ఆయన ప్రమేయం ఉన్న ఒక అశ్లీల ఎమ్ఎమ్ఎస్ క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. అది అతడి ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో సినిమా అవకాశాలు రాలేదు. ఏడు సంవత్సరాల తర్వాత, 2013లో సూపర్ మోడల్‌తో తిరిగి వచ్చారు. అనంతరం సల్మాన్ ఖాన్ 'మూవీ జై హో'లో నటించారు. రిపబ్లిక్ వరల్డ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, అష్మిత్ పటేల్ సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, వ్యక్తిగత ఎదుగుదల, కెరీర్ లక్ష్యాల గురించి మాట్లాడారు. ఆయన తన కెరీర్‌లో 'ఇంటర్‌మిషన్ పాయింట్'లో ఉన్నట్లు వివరించారు. తన అనుభవాన్ని ప్రతిబింబిస్తూ, సంవత్సరాలు గడిచేకొద్దీ, నటుడిగా మరింత సౌకర్యవంతంగా, నమ్మకంగా ఉన్నానని అష్మిత్ పంచుకున్నారు. 15 సంవత్సరాల క్రితంతో పోలిస్తే తన నటన మరింత మెరుగుపడిందని తెలిపారు.
ఓటీటీలో అష్మిత్ పటేల్
అష్మిత్ పటేల్ సినిమాల్లో పని చేయడమే కాకుండా టెలివిజన్‌లో కూడా కనిపించారు. బిగ్ బాస్ సీజన్ 4, 'ఝలక్ దిఖ్లా జా' సీజన్ 5 వంటి పాపులర్ టీవీ షోలలో కంటెస్టెంట్‌గా ఉన్నారు. 2020లో 'పెషావర్', 'ది బుల్ దలాల్ స్ట్రీట్'తో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అరంగేట్రం చేశారు. ప్రస్తుతం అష్మిత్ పటేల్ భిన్నమైన కెరీర్ ఎంచుకున్నారు. ఇప్పుడు ప్రొఫెషనల్ డీజేగా పనిచేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎత్తు పల్లాలు రెండూ చూసిన అష్మిత్, ఇప్పుడు మ్యూజిక్‌లో కొత్త కెరీర్ వెతుక్కున్నారు.