Actor Signed 40 Movies Before Debut : 90వ దశకంలో బాలీవుడ్ లోని అతిపెద్ద స్టార్లలో ఈయన కూడా ఒకరు. అప్పట్లో భారీ పారితోషకాన్ని అందుకున్న జాబితాలో ఈయన ఉన్నారు. ఎక్కువగా యాక్షన్ సినిమాల్లోనే నటించినప్పటికీ 'ఫ్యామిలీ మ్యాన్'గానూ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.
ఇంతకీ ఆయన ఎవరో కాదు బీటౌన్ స్టార్ హీరో సునీల్ శెట్టి. 1992లో 'బల్వాన్' అనే సినిమాతో నటనా ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ సీనియర్ నటుడు ఇప్పటి వరకూ దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి నార్త్‌తో పాటు సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్వరలోనే హేరా ఫేరీ-3లో శ్యామ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
తన తండ్రి చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి ముంబయికి వచ్చారని, అక్కడ పొట్టకూటి కోసం ఓ రెస్టారెంటులో టేబుల్స్‌ను శుభ్రం చేసేవారని గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో పడుకునేందుకు మంచాలు లేక బియ్యం బస్తాలపై నిదురించేవారంటూ అప్పటి కష్టాలను చెప్పుకొచ్చారు.
తన మొదటి చిత్రం 'బల్వాన్' సంతకం చేసినప్పుడు ఆయన దాదాపు ఓ 40 సినిమా స్క్రిప్ట్‌లకు ఓకే చేశారట. కనీసం స్క్రిప్ట్ కూడా చదవకుండానే ఆయన కొన్ని సినిమాకు సంతకం చేసేశారట. అలా 'బల్వాన్' సినిమా థియేటర్లలోకి రాకముందే ఆయన 40 చిత్రాలకు సంతకం చేసినట్లు చెప్పుకొచ్చారు. 'బల్వాన్' మంచి విజయం దక్కించుకోవడంతో ఆయన కెరీర్ ఓ ములుపు తిరిగింది. 'గోపీ కిషన్', 'మోహ్రీ', 'ధడ్కన్' వంటి మరిన్ని సినిమాలు హిట్ అయ్యాయని శెట్టి చెప్పుకొచ్చారు.
2000వ ఏడాది తర్వాత సునీల్ శెట్టి మల్టీస్టారర్ చిత్రాల్లో కనిపించడం మొదలెట్టారు. 'మై హూనా', 'ధడ్కన్' వంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్‌లోనూ కనిపించి మెప్పించారు. 'హేరా ఫేరీ', 'ఆవారా పాగల్ దీవానా' చిత్రాల్లో కమెడీ పాత్రలతోనూ ప్రయోగాలు చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్, టర్కిష్ భాషల్లో నటించారు. తాజాగా 'ధారావి బ్యాంక్' అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో అడుగుపెట్టి అక్కడ కూడా తనదైన స్టైల్లో మెప్పించారు.
కేవలం యాక్టింగ్ లో మాత్రమే సునీల్ శెట్టి పాప్ కార్న్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇవే కాక, రెస్టారెంట్స్, ఆలోమొబైల్స్, ఇతర బిజినెన్ ప్లాన్స్ ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ శెట్టి నికర విలువ రూ.125 కోట్లని ట్రేడ్ వర్గాల సమాచారం.