What Is Dry Promotion : గ్లోబల్ జాబ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. ఉద్యోగాలు చేసే విధానంలో మార్పు వస్తోంది. మారుతున్న టెక్నాలజీ, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త ధోరణులు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం నుంచి మూన్ లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వరకు ఈ జాబితా చాలా పొడవుగా ఉంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. ఈ కొత్త ట్రెండ్ పేరే "డ్రై ప్రమోషన్". డ్రై ప్రమోషన్ అంటే ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇవ్వడం. మరో మాటలో చెప్పాలంటే, ఉద్యోగి టైటిల్ మారినప్పుడు, పనిభారం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. కానీ జీతం మాత్రం పెరగదు.
ప్రమోషన్ ఓకే - మరి జీతం సంగతి!
సాధారణంగా ఉద్యోగంలో ప్రమోషన్ అంటే బాధ్యతలతోపాటు వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలు కూడా పెరుగుతాయి. కానీ అవేవీ లేకుండా కేవలం బాధ్యతలను మాత్రమే పెంచితే దాన్ని 'డ్రై ప్రమోషన్' అని అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే, కంపెనీలో డెసిగ్నేషన్ మారడం వల్ల పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. కానీ వేతనాలు, ప్రోత్సహకాలు మాత్రం పెరగవు.
ప్రముఖ కన్సల్టెంట్ పెర్ల్ మేయర్ నివేదిక ప్రకారం, 13% కంటే ఎక్కువ మంది యజమానులు తమ ఉద్యోగులకు జీతాలు పెంచుకుండా ప్రమోషన్లు ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, 2018లో ఈ సంఖ్య 8% మాత్రమే. 900 కంపెనీలపై జరిపిన సర్వేలో, 2023తో పోలిస్తే 2024లో తక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు తేలింది. సంస్థలు అవలంభిస్తున్న ఈ కొత్త ట్రెండ్ వల్ల చాలా మంది ఉద్యోగులు సంతోషంగా లేరు. కంపెనీలు ఖర్చు తగ్గింపు చర్యలపై దృష్టి సారించడం వల్లే ఈ డ్రై ప్రమోషన్లు పెరుగుతున్నాయి. ఈ పదోన్నతులు ఉద్యోగిని ఆర్థిక అనిశ్చితి వైపు నడిపిస్తాయి. ఇంతకు ముందు కార్మికుల కొరతను ఎదుర్కొనేందుకు, ఉద్యోగులను కొనసాగించేందుకు కంపెనీలు కచ్చితంగా జీతాలను పెంచేవి. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది.
ఈ కొత్త ట్రెండ్‌కి సాక్ష్యం సోషల్ మీడియానే అని చెప్పవచ్చు. ఇక్కడ చాలా మంది ఉద్యోగులు తమకు వచ్చిన డ్రై ప్రమోషన్ అనుభవాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఉదాహరణకు, గత సంవత్సరం షేర్ చేసిన Reddit థ్రెడ్‌లో, ఒక వ్యక్తి, తాను కేవలం ప్రమోషన్ మాత్రమే పొందినట్లు చెప్పారు. వేతనాలు ఏ మాత్రం పెంచలేదని స్పష్టం చేశాడు.
న్యూ ట్రెండ్స్
ఆఫీసుకు తప్పనిసరిగా రావాలని కంపెనీలు ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్ విధానాన్ని అవలంబించిన సంగతి తెలిసిందే. రమ్మన్నారు కదాని అలా వచ్చి కాసేపు కాఫీ తాగి మేనేజర్లు, హెచ్ఆర్ల దృష్టిలో పడి ఇంటికి వెళ్లడాన్నే కాఫీ బ్యాడ్జింగ్గా వ్యవహరించారు. యాజమాన్యానికి తెలియకుండా రెండో ఉద్యోగం చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు. కేవలం అప్పగించిన బాధ్యతలకు మాత్రమే పరిమితమై, ఇతర పనుల నుంచి తప్పించుకోవడాన్ని క్వైట్ క్విటింగ్గా పేర్కొంటున్నారు. ఈ విధంగా కార్పొరేట్ రంగంలో అనేక పదాలు ఇటీవల తెరపైకి వచ్చాయి.
కృత్రిమ మేధ (AI) ఎంత డెవలప్ అయినా - ఈ జాబ్స్ మాత్రం సేఫ్! - Jobs That Are Safe From AI
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips